Telugu Global
International

ట్విట్టర్: వర్డ్ కౌంట్ పెరుగుతోంది.. ఉద్యోగాలు పోతున్నాయ్

ఇప్పటి వరకు.. షేర్, కాపీ, సెండ్ వయా మెసేజ్, బుక్ మార్క్ కోసం ఒకటే బటన్ ఉండేది. ఇప్పుడు బుక్ మార్క్ కోసం ప్రత్యేకంగా ఓ బటన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

ట్విట్టర్: వర్డ్ కౌంట్ పెరుగుతోంది.. ఉద్యోగాలు పోతున్నాయ్
X

టిక్కుల గోలతో సంచలనం రేకెత్తించిన ఎలన్ మస్క్, ఉద్యోగుల తీసివేతతో అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత తనకు తానే సీఈఓగా వైదొలగుతానంటో ఓ పోల్ పెట్టుకుని మరీ షాకిచ్చారు. చివరకు తనకంటే పెద్ద వెధవ దొరికితే ఆ పదవి వదిలేస్తానన్నారు. అసలు మస్క్ ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కొత్త ఏడాది కూడా మస్క్ మార్పులను వదిలిపెట్టలేదు. ట్విట్టర్ల్ భారీ మార్పులుంటాయని చెబుతున్నారు.

రికమండెడ్ ట్వీట్లను చూడటమే కానీ వాటిని స్కిప్ చేయడం ఇప్పటి వరకూ ఉండేది కాదు, కానీ ఇప్పుడు రికమండెడ్ ట్వీట్లు, ఫాలోవ్డ్ ట్వీట్లను తేలిగ్గా స్కిప్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ట్విట్టర్. యూజర్ ఇంటర్ ఫేస్ లో మార్పులు కూడా చేయబోతున్నారు ఇవన్నీ మరో వారం రోజుల్లో అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఇప్పటికే కొన్ని అకౌంట్లలో ప్రయోగాత్మకంగా ఈ మార్పులు అందుబాటులోకి వచ్చేశాయి కూడా.

బుక్ మార్క్ ట్వీట్..

ఇప్పటి వరకు.. షేర్, కాపీ, సెండ్ వయా మెసేజ్, బుక్ మార్క్ కోసం ఒకటే బటన్ ఉండేది. ఇప్పుడు బుక్ మార్క్ కోసం ప్రత్యేకంగా ఓ బటన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ట్వీట్ వివరాలకోసం బుక్ మార్క్ బటన్ వచ్చే వారం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

నెంబర్ గేమ్..

ఇప్పటి వరకు ఒక్కో ట్వీట్ లో కేవలం 280 అక్షరాలు మాత్రమే పొందుపరిచే వీలుంది. గతంలో 140 అక్షరాలున్న దాన్ని 280కి పెంచారు. ఇప్పుడు ఆ సంఖ్యను 4వేలకు పెంచుతామంటున్నారు. అంటే సుదీర్ఘ ట్వీట్లను లింకుల రూపంలో ఇవ్వకుండా ఒకేసారి పోస్ట్ చేసేయొచ్చనమాట. అయితే దీనిపై వ్యతిరేకత కూడా వస్తోంది. ట్వీట్ అంటే సింపుల్ గా, సూటిగా, స్పష్టంగా ఉండాలని.. 4వేల అక్షరాలకు పెంచితే అది ట్వీట్ కాదని, ఒక వ్యాసం అవుతుందనే కామెంట్లు వినపడ్డాయి. కానీ మస్క్ మాత్రం ట్వీట్ లో అక్షరాల సంఖ్య పెంచేందుకే నిర్ణయించారు. ప్రస్తుతానికి సంఖ్యపై క్లారిటీ లేదు కానీ, సుదీర్ఘ ట్వీట్ ఆప్షన్ ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వస్తుంది.

ఉద్యోగాల్లో కోత..

ఇది ట్విట్టర్లో నిత్యకృత్యంగా మారింది. అక్షరాల సంఖ్య ఓవైపు పెంచుకుంటూ పోతూ, మరోవైపు ట్విట్టర్లో ఉద్యోగుల సంఖ్యను మాత్రం తగ్గించేస్తున్నారు మస్క్. మస్క్ యజమాని అయిన తర్వాత ట్విట్టర్ ఉద్యోగులకు కంటినిండా నిద్ర కరువైంది. ఇప్పటికే సగం మంది ఉద్యోగులపై వేటు వేసిన ఎలన్‌ మస్క్‌.. తాజాగా డబ్లిన్‌, సింగపూర్‌ కేంద్ర కార్యాలయాల్లోని ఉద్యోగులను తొలగించారు. భారత్‌ లోనూ చాలా మందిని ఇంటికి పంపించేశారు.

First Published:  9 Jan 2023 2:22 AM GMT
Next Story