Telugu Global
International

స్మశానాలుగా మారిన టర్కీ, సిరియా, 4వేలు దాటిన మరణాల సంఖ్య

కేవ‌లం టర్కీలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశ డిజాస్ట‌ర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయ‌ప‌డ్డ‌వారి సంఖ్య 15,834గా ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. సిరియాలో భూకంపం వ‌ల్ల సుమారు 1451 మంది మ‌ర‌ణించారు. మ‌రో 3531 మంది గాయ‌ప‌డ్డారు.

స్మశానాలుగా మారిన టర్కీ, సిరియా, 4వేలు దాటిన మరణాల సంఖ్య
X

టర్కీ, సిరియా దేశాలు స్మశానంలా కనిపిస్తున్నాయి. నగరాలు శిథిలాలుగా మారాయి. ఈ రెండు దేశాల్లో సంభవించిన భూకంపం వల్ల ఆ దేశాలు కోలుకోలేని పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. ఇప్పటి వరకు ఆయా దేశాల అధికారిక లెక్కల ప్రకారం 4,372 మంది మరణించారు.

కేవ‌లం టర్కీలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశ డిజాస్ట‌ర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయ‌ప‌డ్డ‌వారి సంఖ్య 15,834గా ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. సిరియాలో భూకంపం వ‌ల్ల సుమారు 1451 మంది మ‌ర‌ణించారు. మ‌రో 3531 మంది గాయ‌ప‌డ్డారు. రెండు దేశాల్లో కలిపి 5,600 కంటే ఎక్కువ భవనాలు శిథిలమై పోయాయని అధికారులు చెప్తున్నారు.

అయితే మరణాల సంఖ్య 20 వేలు ఉంటు‍ందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

ఆగ్నేయ టర్కిష్ నగరమైన సాన్లియుర్ఫాలో, కూలిపోయిన ఏడు అంతస్థుల భవనం శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలు రాత్రి పగలు పని చేస్తున్నాయి.

"శిథిలాల కింద నాకు తెలిసిన కుటుంబం ఉంది" అని 20 ఏళ్ల సిరియన్ విద్యార్థి ఒమెర్ ఎల్ కునీడ్ చెప్పాడు.

"ఉదయం 11:00 గంటల వరకు, శిథిలాల కింద ఉన్న నా స్నేహితురాలు ఫోన్‌కి సమాధానం ఇస్తూనే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆమె వైపు నుండి ఏ సమాధానం లేదు. ఆమెమరణించి ఉండవచ్చు" అని ఆయన అన్నారు.

బయట గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ, భయాందోళనకు గురైన ప్రజలు వెచ్చదనం కోసం మంటల వేసుకొని రాత్రిపూట వీధుల్లో గడిపారు.

ముస్తఫా కోయుంకు అనే వ్యక్తి తన భార్యను, వారి ఐదుగురు పిల్లలను వారి కారులోనే ఉంచాడు. వాళ్ళు బైటికి రావడానికే భయపడుతున్నారు.

టర్కీలోని మూడు ప్రధాన విమానాశ్రయాలు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. ఎందుకూ పనికిరాకుండా పోయాయని, దాంతో కీలకమైన సహాయ పంపిణీలు కష్టతరంగా మారాయని అధికారులు తెలిపారు.

మళ్ళీ ఈ రోజు కూడా టర్కీలో భూప్రకంపనలు వచ్చాయి. మరో వైపు అమెరికా, భార‌త్‌తో పాటు చాలా దేశాలు టర్కీ, సిరియాలకు స‌హాయాన్ని అందిస్తున్నాయి.

First Published:  7 Feb 2023 5:46 AM GMT
Next Story