Telugu Global
International

అదానీపై హిండెన్ బర్గ్ నివేదికతో పండగ చేసుకుంటున్న ట్రక్ డ్రైవర్లు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని గగల్‌, దార్లఘాట్లో ఉన్న అదానీకి చెందిన ACC, అంబుజా సిమెంట్ ఫ్యాక్ట‌రీల నుండి రోజూ 7 వేల ట్రక్ లతో సిమెంట్ సరఫరా అవుతుంది. అయితే సిమెంట్ సరఫరాకు ట్రక్ యజమానులు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని అది తమకు లాభదాయకం కాదని అదానీ గ్రూపు తన కంపెనీలను మూసేసింది.

అదానీపై హిండెన్ బర్గ్ నివేదికతో పండగ చేసుకుంటున్న ట్రక్ డ్రైవర్లు
X

హిండెన్ బర్గ్ రీసర్చ్ నివేదికతో అదానీ గ్రూపు అతలాకుతలమై పోయింది. షేర్ల పతనంతో అదానీ గ్రూపుల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలో హిండెన్ బర్గ్ నివేదిక తమ సమస్యను పరిష్కరించిందని హిమాచల్ ప్రదేశ్ లోని ట్రక్ డ్రైవర్లు, యజమానులు ఆనందపడుతున్నారు. అవును...అమెరికాలో హిండెన్ బర్గ్ స్విచ్ వేస్తే భారత్ లోని హిమచల్ ప్రదేశ్ లో బల్బు వెలిగింది. అసలు కథేంటంటే...

హిమాచల్‌ ప్రదేశ్‌లోని గగల్‌, దార్లఘాట్లో ఉన్న అదానీకి చెందిన ACC, అంబుజా సిమెంట్ ఫ్యాక్ట‌రీల నుండి రోజూ 7 వేల ట్రక్ లతో సిమెంట్ సరఫరా అవుతుంది. అయితే సిమెంట్ సరఫరాకు ట్రక్ యజమానులు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని అది తమకు లాభదాయకం కాదని అదానీ గ్రూపు తన కంపెనీలను మూసేసింది.

ట్రక్కుల యజమానులు ఒక కిలోమీటర్ కు 11 రూపాయలు అడుగుతున్నారు. అదానీ గ్రూపు అందులో సగం ఇస్తానంటోంది. కొంత కాలంగా ఇరు వర్గాల మధ్య ఈ సమస్య తేలకపోవడంతో అదానీ గ్రూపు తన సిమెంట్ ఫ్యాక్టరీలను బంద్ పెట్టింది. దీనిపై ట్రక్ డ్రైవర్లు, కంపెనీ కార్మికులు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ నివేదిక వచ్చింది.

ఒక వైపు హారతి కర్పూరంలా కరిగిపోతున్న ఆస్తులు, మరో వైపు మదుపుదార్లు నమ్మకాన్ని కోల్పోతుండటం అదానీని ఉక్కిరిబిక్కిరి చేసి‍ంది. ఇలాంటి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీలను మూసేస్తే మదుపుదార్లు తమపై మరింత నమ్మకం కోల్పోతారని భావించిన అదానీ గ్రూపు దిగి వచ్చింది. ట్రక్ యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ట్రక్ యజమానులు అడుగు తున్న రేటులో 10 నుంచి 12 శాతం తగ్గించి సమస్యను పరిష్కరించుకుందామని కోరింది.

దీంతో ట్రక్ యజమానులు, డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనిర్ణయం అదానీపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ ట్రక్ యజమానుల, డ్రైవర్ల జీవనోపాధినిమాత్రం కాపాడింది.

‘భారత్‌లోని అతి పెద్ద వ్యాపార సంస్థకు వ్యతిరేకంగా మేం చేసిన పోరాటంలో హిండెన్ బర్గ్ నివేదిక కీలక పాత్ర పోషించింది. డ్రైవర్లను చైతన్య పరచడానికి, రాజకీయ మద్దతు కూడగట్టడానికి సహాయ పడింది’ అని పోరాటానికి నాయ కత్వం వహించిన రామ్‌ కృష్ణన్‌ శర్మ తెలిపారు.

First Published:  24 Feb 2023 3:36 AM GMT
Next Story