Telugu Global
International

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ, ఒక ఏపీ వ్యక్తి మృతి

మినీ వ్యానులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్లు కాగా, ఒకరు తూర్పు గోదావరి జిల్లా కడియపులంక వాసిగా గుర్తించారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ, ఒక ఏపీ వ్యక్తి మృతి
X

అమెరికాలో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు తెలుగు విద్యార్థులను బలి తీసుకుంది. దీపావళి పండుగ సంబరాల్లో ఇండియాలోని కుటుంబాలు ఉండగానే.. వారి మరణ వార్త విషాదాన్ని నింపింది. యూఎస్‌లోని కనెక్టికట్ రాష్ట్రంలో మినీ వ్యాను, ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరొక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మినీ వ్యానులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్లు కాగా, ఒకరు తూర్పు గోదావరి జిల్లా కడియపులంక వాసిగా గుర్తించారు.

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడియపులంకకు చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాస్ కుమారుడు సాయి నరసింహా (23) అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం నరసింహతో పాటు మరో ఏడుగురు కలిసి మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్నారు. పొగమంచు కారణంగా వీళ్లు ప్రయాణిస్తున్న వ్యాన్.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో నరసింహా, వరంగల్‌కు చెందిన పావని, హైదరాబాద్‌కు చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి గాయాలవడంతో వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందింస్తున్నారు. ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. సాయి నరసింహా చెన్నైలోని హిందూస్థాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో జాబ్ వచ్చినా.. ఎంఎస్ చేయాలనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. ఈ ఏడాది అగస్టు 5నే అతడు అక్కడకు వెళ్లాడు. కానీ ఇంతలోనే కుమారుడు మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదే గ్రామానికి చెందిన సిద్ధిరెడ్డి ఐశ్వర్య కూడా అదే కారులో ప్రయాణిస్తోంది. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఇక మృతి చెందిన మిగిలిన ఇద్దరి గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం గాయపడిన వాళ్లు బెర్క్‌షైర్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.

First Published:  26 Oct 2022 11:42 AM GMT
Next Story