Telugu Global
International

ఐరాస ప్రపంచ పర్యావరణ‌ సదస్సు స్పాన్సరర్స్ అత్యంత కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలే

ప్రపంచంలో నెంబర్ 1 ప్లాస్టిక్ కాలుష్య కారకురాలైన కోకాకాకోలా కంపెనీ 'ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న ప్రపంచ వాతావరణ మార్పు సదస్సుకు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కాలుష్యంపై ఐక్యరాజ్యసమితి చేసే పోరాటంలోని నిజాయితీపై అనుమానాలు రెకెత్తుతున్నాయి.

ఐరాస ప్రపంచ పర్యావరణ‌ సదస్సు స్పాన్సరర్స్ అత్యంత కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలే
X

ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈజిప్టులో జరుగుతున్న 27వ 'ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ మార్పు సదస్సు' (COP27) కు ఒక‌ స్పాన్సర్ కోకా కోలా కంపెనీ. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్న కోకా కోలా కంపెనీ సమర్పణలో పర్యావరణాన్ని రక్షించడానికి ప్రపంచ పర్యావరణ సదస్సు జరగడం అదికూడా ఐక్యరాజ్యసమితి నిర్వహించడం వింతల్లోకెల్లా వింత.

ఇక ప్రపంచంలో నెంబర్ 1 ప్లాస్టిక్ కాలుష్య కారకురాలైన కోకాకాకోలా గురించి, దాని తర్వాతి స్థానాల్లో ఉన్న సంస్థల గురించి అంతర్జాతీయ సంస్థల సర్వేలు, అద్యయనాలు చేసి తేల్చిన విషయాలను తెల్సుకుందాం.

'బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్' చేపట్టిన గ్లోబల్ బ్రాండ్ ఆడిట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రపంచం మీదికి వదులుతున్న కంపెనీల్లో అగ్రస్థానం వహిస్తున్నవి కోకా-కోలా కంపెనీ, పెప్సికో,నెస్లే. ఈ ఐదేళ్ల కాలంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్య కారకాలుగా ఈ కంపెనీలు గుర్తించబడ్డాయి.

2018-2022 మధ్య చేపట్టిన సర్వే నివేదిక లో... "ఈ ఐదేళ్ల కాలంలో, కోకా-కోలా కంపెనీ గణనీయమైన ప్లాస్టిక్ కాలుష్యాన్ని వెదజల్లి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలిచింది. దాని తర్వాత పెప్సీకో, నెస్లే, యూనిలీవర్ , ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, మోండెజ్ ఇంటర్నేషనల్ టాప్ 5 లిస్ట్ లో ఉన్నాయి.'' అని పేర్కొంది.

శాస్త్రవేత్తలు అత్యధిక వ్యర్థాలను ఉత్పత్తి చేసే కంపెనీలను గుర్తించడానికి 4,29,994 ప్లాస్టిక్ కాలుష్యం ముక్కలను సేకరించి, విశ్లేషించారు.

ఈ ఐదేళ్ళ కాలంలో ప్రతి సంవత్సరం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. కోకా-కోలా కంపెనీ ఐదేళ్లలో ఎన్నడూ వెనక్కి తగ్గకుండా ప్లాస్టిక్ కాలుష్యాన్ని వెదజల్లడంలో అగ్రస్థానంలో ఉంది.

2022లో 44 దేశాలలో 14,760 మంది వాలంటీర్ల బృందం, కాలుష్య కారకాలైన 31,000 కంటే ఎక్కువ కోకా-కోలా బ్రాండ్ ఉత్పత్తులను కనుగొన్నట్లు నివేదిక తెలిపింది. ఇది 2021 కన్నా 63% పెరుగుదలను సూచిస్తోంది. 2018 కన్నా మూడు రెట్లు ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని కోకాకోలా ఉత్పత్తి చేసింది.

ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు 2025 కల్లా పూర్తిగా వాటిని కంట్రోల్ చేస్తామంటూ ఐదేళ్ళ క్రితమే 'ఎల్లెన్ మాక్‌ఆర్థర్ ఫౌండేషన్ న్యూ ప్లాస్టిక్ ఎకానమీ గ్లోబల్ కమిట్‌మెంట్' పై సంతకం చేశాయి. సంతకాలు సంతకాలుగానే ఉన్నాయి. కానీ ఈ ఐదేళ్ళలో కోకాకోలాతో సహా ఏ సంస్థ కూడా తమ లాభాల వేట తప్ప అటువైపు అడుగు వేసే ప్రయత్నం చేయలేదు.

ఇక ఓ సారి భారత దేశం గురించి కూడా తెలుసుకుందాం.

భారత దేశంలోని 34 నగరాల్లో 5,216 మంది వాలంటీర్ల సహాయంతో 98 బ్రాండ్ ఆడిట్ ఈవెంట్‌లను నిర్వహించి భారత్ లోని ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి వివరమైన రిపోర్ట్ ఇచ్చింది 'బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్' సంస్థ.

ప్రభుత్వ లెక్కల ప్రకారం 2020-21లో భారతదేశం దాదాపు 35 లక్షల‌ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసింది.

జూలై 1, 2022 నుండి, భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు అధికారికంగా నిషేధించబడ్డాయి.

అయితే నిషేధాన్ని అమలు చేయడంలో వైఫల్యం వల్ల అవి మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి.

ఇక భారత్ లో 2022 లో ప్లాస్టిక్ కాలుష్యం అత్యంత ఎక్కువగా వెదజల్లుతున్న సంస్థల్లో అగ్రస్థానం పెప్సీకో ది. దాని తర్వాత CG ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,పెర్ఫిట్టి వాన్ మెల్లె లు రెండు, మూడవ ప్లేసుల్లో ఉన్నాయి. అదే విధంగా 2018 లో నెంబర్ 1 స్థానం పెర్ఫిట్టి వాన్ మెల్లె కాగా 2019 లో SS ఫుడ్ ప్రొడక్ట్స్, 2020 లో తమిళనాడు కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్. 2021లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) దేశంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారకాలుగా ఉన్నాయి.

ప్రపంచాన్ని వినాశనం దిశగా తీసుకెళ్తున్న ప్లాస్టిక్ ను లేకుండా చేయాలంటూ ఒకవైపు పర్యావరణ వేత్తలు పోరాడుతుంటారు. ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా పాలకులు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఐక్యరాజ్యసమితి కూడా ప్లాస్టిక్ కాలుష్యాన్ని రూపుమాపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నానని చెప్తూ ఉంటుంది. మరో వైపు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నాశనం చేయడానికి ఆ కాలుష్యానికి కారణమైన వారి స్పాన్సర్ షిప్ లో సదస్సులు నిర్వహిస్తూ ఉంటే...'ప్లాస్టిక్ అంతం మా పంతం' అంటూ వాళ్ళిచ్చే నినాదాల నిజాయితీ మీద అనుమానం కలగడంలో తప్పుందా ?


First Published:  17 Nov 2022 10:54 AM GMT
Next Story