Telugu Global
International

ట్విట్టర్ కొనుగోలు వెనుక ఇంత కథ నడిచిందా?

ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఎలన్ మస్క్ ప్రకటించక ముందు నుంచే దాన్ని టేకోవర్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు.

ట్విట్టర్ కొనుగోలు వెనుక ఇంత కథ నడిచిందా?
X

మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను వరల్డ్ టాప్ బిలియనీర్లలో ఒకరైన ఎలన్ మస్క్ పూర్తిగా హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. మార్కెట్ వాల్యూ కంటే అత్యంత ఎక్కువ మొత్తం ఇచ్చి మస్క్ ఎందుకు సొంతం చేసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఎలన్ వద్ద బిలియన్ల కొద్ది డబ్బు ఉండవచ్చు. కానీ, తన సంపదనే సగానికి తగ్గించేసే డీల్‌కి ఎందుకు ఒప్పుకున్నాడు? ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వని ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఎందుకు కొన్నాడు? దీని వెనుక ఎవరున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఎలన్ మస్క్ ప్రకటించక ముందు నుంచే దాన్ని టేకోవర్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కూడా ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని భావించినా.. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను కొనుగోలు చేయాలని విఫలయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ట్రంప్ అకౌంట్‌ను ట్విట్టర్ ఏకంగా డిలీట్ కొట్టడంతో కోపంతో రగిలిపోయారు. కానీ, యూఎస్ మార్కెట్ నిబంధనలను అనుసరిస్తే ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం కష్టమే అని భావించిన ట్రంప్.. మరో దారి వెతుక్కున్నారు.

ఇక్కడ మరో కథ చెప్పుకోవాలి. అమెరికాలోని రైట్ వింగ్‌కు ట్విట్టర్ పెద్ద అడ్డుగోడగా నిలిచింది. వాళ్లు చేసే అబద్దపు ట్వీట్లను ట్విట్టర్ యూజర్స్ రిపోర్ట్స్ కొడితే డిలీట్ చేస్తూ వచ్చింది. సాధారణంగా ట్విట్టర్‌లో ఎవరు ట్వీట్ చేసినా.. రిపోర్టులు కొడితే ఆ ట్వీట్లు డిలీట్ అయ్యేవి. వరుసగా అలాంటి అబద్దపు సమాచారం వెల్లడిస్తుంటే ఏకంగా అకౌంట్లు డిలీట్ అయ్యేవి. దీని వల్ల అమెరికాలోని రైట్ వింగ్ చాలా ఇబ్బంది పడింది. ముఖ్యంగా ట్రంప్ రెండో సారి అధ్యక్షుడు కావడానికి ఇలాంటి ట్వీట్లను చాలా చేశారు. ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. దీంతో అప్పట్లో ట్విట్టర్ ట్రంప్‌ అకౌంట్‌ను డిలీట్ చేసేసింది.

కాగా, ట్విట్టర్‌ను పారదర్శకంగా మార్చడానికి కొనుగోలు చేస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన చాలా వారాల తర్వాత ఆ సంస్థను హస్తగతం చేసుకున్నారు. ఎలన్ మస్క్ చాలా ఆరోపణలు చేశారు. ట్విట్టర్ చాలా మంది ట్వీట్లను మార్చేస్తోందని, డిలీట్ చేస్తోందని చెప్పుకొచ్చారు. మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ రూపొందించిన ఒక అల్గారిథమ్ కారణంగానే ఇలాంటి ఆటో డిలీట్ ఆప్షన్ వచ్చిందని ఆరోపించారు. భవిష్యత్‌లో ట్వీట్ల డిలీట్ కారణంగా ఎలాంటి న్యాయ సంబంధిత సమస్యలు రాకుండా.. ఆ సంస్థ లీగల్ చీఫ్ విజయ గద్దె ఎప్పటికప్పుడు పాలసీలను మార్చేశారని ఆరోపణలు చేశారు.

కాగా, ఈ ఆరోపణలు అన్నీ ఎలన్ మస్క్ నేరుగా చేయకుండా RUMBLE అనే సామాజిక వేదికగా ఒకరితో చేయించారు. రంబుల్‌లో ట్విట్టర్‌కు వ్యతిరేకంగా ముఖ్యంగా పరాగ్, విజయపై అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే..ఈ RUMBLE అనే సామాజిక వేదిక ట్రంప్ కంపెనీ సపోర్ట్‌తో నడుస్తోంది. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఈ సామాజిక వేదికను హస్తగతం చేసుకోనున్నట్లు అమెరికా మీడియా బయటపెట్టింది. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను భారీ మొత్తంతో కొనుగోలు చేయడం వెనుక ట్రంప్ కూడా ఉన్నట్లు తెలిపింది. నగదు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేయడం, అందుకు అవసరం అయిన నిధులను బ్యాంకులు ఇవ్వడం వెనుక అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు వెస్ట్రన్ మీడియా కథనాలు వెలువరిస్తోంది.

First Published:  8 Nov 2022 10:43 AM GMT
Next Story