Telugu Global
International

ట్రంప్ అరెస్ట్ ఖాయమేనా? - ఆయ‌న‌పై నేరారోప‌ణ‌ల‌ను ధ్రువీక‌రించిన గ్రాండ్ జ్యూరీ

తాజాగా గ్రాండ్ జ్యూరీ ఈ వ్య‌వ‌హారాన్ని ధ్రువీక‌రించిన నేప‌థ్యంలో.. దీనిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజ‌కీయ అణ‌చివేత అని విమ‌ర్శించారు.

ట్రంప్ అరెస్ట్ ఖాయమేనా? - ఆయ‌న‌పై నేరారోప‌ణ‌ల‌ను ధ్రువీక‌రించిన గ్రాండ్ జ్యూరీ
X

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఆయ‌న‌పై వ‌చ్చిన నేరారోప‌ణ‌ల‌ను గ్రాండ్ జ్యూరీ ధ్రువీక‌రించ‌డ‌మే దీనికి బ‌లాన్నిస్తోంది. మ‌రోప‌క్క ఈ వ్య‌వ‌హారంతో ట్రంప్ తీర‌ని అప‌ఖ్యాతిని మూట‌గ‌ట్టుకోనున్నారు. అమెరికా చ‌రిత్ర‌లోనే త‌న‌పై వ‌చ్చిన నేరారోప‌ణ‌ల‌పై క్రిమిన‌ల్ చార్జ్ ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్య‌క్షుడిగా ఆయ‌న చ‌రిత్ర‌కెక్క‌నున్నారు.

త‌న‌తో లైంగిక సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపించిన మ‌హిళ‌ను డ‌బ్బుతో ప్ర‌లోభ‌పెట్టిన‌ట్టు ట్రంప్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ విచార‌ణ జ‌రిగింది. తాజాగా న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ వాటిని ధ్రువీక‌రించింది. ఈ వ్య‌వ‌హారంలో ట్రంప్ లొంగిపోతే ఆయ‌న్ని ఆ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్‌.. వ‌చ్చే సోమ‌వారం న్యూయార్క్ వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. మంగ‌ళ‌వారం ఆయ‌న మ‌న్‌హ‌ట్ట‌న్ కోర్టులో హాజ‌ర‌య్యే అవ‌కాశ‌ముంది.

త్వ‌ర‌లోనే త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశ‌ముంద‌ని ట్రంప్ ఇటీవ‌ల ఈ కేసు విచార‌ణ‌లో వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అస‌లు ఆ కేసు వివ‌రాలేమిటంటే.. స్ట్రోమీ డానియ‌ల్స్‌ అనే పోర్న్ స్టార్‌తో త‌న‌కున్న శారీర‌క సంబంధం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండ‌టం కోసం ట్రంప్ ఆమెకు డ‌బ్బిచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నార‌నే ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ఈ ఉదంతం చోటుచేసుకున్న‌ట్టు స‌మాచారం. ఆ ఒప్పందాన్ని ర‌ద్దు చేయాలంటూ స‌ద‌రు మ‌హిళ రెండేళ్ల త‌ర్వాత కోర్టును ఆశ్ర‌యించ‌గా, వాటిని ట్రంప్ ఖండించారు.

తాజాగా గ్రాండ్ జ్యూరీ ఈ వ్య‌వ‌హారాన్ని ధ్రువీక‌రించిన నేప‌థ్యంలో.. దీనిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజ‌కీయ అణ‌చివేత అని విమ‌ర్శించారు. మ‌న్‌హ‌ట్ట‌న్ అటార్నీ.. అధ్య‌క్షుడు జో బైడెన్ చెప్పిన‌ట్టుగా ఆడుతున్నార‌ని ఆరోపించారు. అమాయ‌కుడినైన త‌న‌పై అభియోగాలు మోపార‌ని మండిప‌డ్డారు. దీనిపై ట్రంప్ త‌ర‌ఫున న్యాయ‌వాది స్పందిస్తూ.. ట్రంప్ ఎలాంటి నేరానికీ పాల్ప‌డ‌లేద‌ని, న్యాయ‌స్థానంలో త‌మ పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. మున్ముందు ఈ వ్య‌వ‌హారం ఎటు దారితీస్తుంద‌నేది వేచిచూడాలి.

First Published:  31 March 2023 6:27 AM GMT
Next Story