Telugu Global
International

ఇరాన్ ప్రభుత్వ దుర్మార్గం: 14వేల మంది అరెస్ట్, 50 మంది పిల్లల హత్య!

ఇరాన్‌లోని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, గత రెండు నెలలుగా దేశాన్ని కదిలించిన సామాజిక స్వేచ్ఛ, రాజకీయ మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని ఆపడానికి ఇరాన్‌లోని అధికారులు చేసిన క్రూరమైన అణిచివేత ఆ దేశ యువతకు భయంకరమైన నష్టాన్ని కలిగించింది.

ఇరాన్ ప్రభుత్వ దుర్మార్గం: 14వేల మంది అరెస్ట్, 50 మంది పిల్లల హత్య!
X

ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న ప్ర‌జలపై ఉక్కుపాదం మోపుతోంది. దాడులు, అరెస్టులు, హత్యలతో ఇరాన్ దేశం మొత్తాన్ని ఓ యుద్ద క్షేత్రంలా మార్చింది.

సెప్టెంబరులో మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగా వేసుకోలేదనే కారణంతో మోరలిటీ పోలీసులు కొట్టి చంపిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ముఖ్యంగా స్త్రీలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. వారికి మద్దతుగా పురుషులు కూడా రోడ్లెక్కుతున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహంతో తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హింసకు తెరలేపింది. నిరసనకారులపై దాడులు, అరెస్టులు, హత్యలతో ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది. అయినా ఉద్యమం ఆగకపోగా దేశ‌వ్యాప్తంగా విస్తరించింది.

ఇరాన్‌లోని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, గత రెండు నెలలుగా దేశాన్ని కదిలించిన సామాజిక స్వేచ్ఛ, రాజకీయ మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని ఆపడానికి ఇరాన్‌లోని అధికారులు చేసిన క్రూరమైన అణిచివేత ఆ దేశ యువతకు భయంకరమైన నష్టాన్ని కలిగించింది.

యువకులు, యువతులు, పాఠశాల పిల్లలు కలిసి వీధుల్లో,కళాశాల క్యాంపస్‌లలో భద్రతా దళాలతో ఘర్షణలు పడుతున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.

ఓ 14 ఏళ్ల బాలికను భద్రతా దళాలు దారుణంగా కొట్టి, మాదకద్రవ్యాల నేరస్థులతో పాటు ఒక పెద్ద జైలులో ఉంచారు. ఓ 16 ఏళ్ళ బాలుడిని భద్రతా దళాలు పట్టుకెళ్ళి దారుణంగా కొట్టడంతో అతని ముక్కు రంధ్రం దెబ్బతింది. 13 ఏళ్ల బాలికపై సాధారణ దుస్తుల్లో ఉన్న మిలీషియా అతి క్రూరంగా దాడి చేసింది.

కొందరు నిర్బంధించబడ్డారు, మరికొందరు వీధుల్లో కాల్చి చంపబడ్డారు లేదా భద్రతా దళాల‌ కస్టడీలో చనిపోయారు. అసమ్మతిని అణిచివేసే ప్రయత్నంలో భాగంగా భద్రతా దళాలు అధ్యాపకులపై దాడి చేయడంతో అనేక మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి.

ఇరాన్‌లోని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలతో పాటు, పిల్లల తల్లి,తండ్రులు, కుటుంబాలతో, వారు నివాసముండే ప్రాంతాల్లోని ప్రజలతో మీడియా మాట్లాడినప్పుడు నిర్ఘాంతపోయే నిజాలు బైటపడ్డాయి. నిరసనలకు సహకరించారనే పేరుతో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1000 మంది మైనర్లపై అధికారులు దాడులు చేశారు. 50 మందికి పైగా మైనర్లను చంపారు.

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, ఇరాన్ లో 14,000 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. భద్రతాదళాలు ప్రధానంగా యువతను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్నాయి.

అయితే గత 20 ఏళ్లుగా దేశాన్ని కుదిపేసిన వివిధ నిరసనల సందర్భంగా ఎన్నడూ కనిపించని ధోరణి ప్రభుత్వంలో ఇప్పుడు కనిపిస్తోందని న్యావాదులు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం నిరసనకారులపై కక్షతో వ్యవహరిస్తోంది. ఎంతటి హింసకు పాల్పడైనా సరే ఉద్యమాన్ని ఆపాలని ప్రభుత్వం భావిస్తోందని వారు చెప్తున్నారు.దీనిపై ఇరాన్ మానవ హక్కుల ఉన్నత మండలి సెక్రటరీ జనరల్ కజెమ్ ఘరీబాబాడి కనీసం స్పందించడానికి కూడా సిద్దంగా లేడు.

మరో వైపు చరిత్రలో మొదటి సారిగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఇరాన్‌పై అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇరాన్ లో జరుగుతున్న దురాగతాలపై గ్లోబల్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ పై చర్చ జరగబోతోంది. అంతే కాదు UN ఉన్నత బాలికల హక్కుల సంస్థ‌ నుండి ఇరాన్ క్‌ను బహిష్కరించాలనే డిమాండ్ పై కూడా చర్చజరగబోతున్నది. .

First Published:  16 Nov 2022 8:15 AM GMT
Next Story