Telugu Global
International

యూరప్ లో తీవ్రమైన కరువు... 500 ఏళ్ళలో మొదటి సారి

యూరప్ కరువు కోరల్లో చిక్కుకుంది. వాతావరణ మార్పుల వల్ల అక్కడ నదులు ఎండిపోయాయి. వ్యవసాయం దెబ్బతింది, పశువులకు కూడా తాగు నీళ్ళు, ఆహారం లేక పాల ఉత్పత్తులు పడిపోయాయి. చివరకు ప్రజలకు తాగడానికి కూడా మంచినీళ్ళు దొరకడం లేదు. బ్రిటన్ ప్రభుత్వం మంచి నీళ్ళపై ఆంక్షలు విధించింది.

యూరప్ లో తీవ్రమైన కరువు... 500 ఏళ్ళలో మొదటి సారి
X

యూరప్ లో ఎన్నడూ లేని విధంగా కరువు విలయతాండవం చేస్తోంది. యూరప్ లోని సగానికి పైగా దేశాల్లో, ముఖ్యంగా పశ్చిమ, మధ్య, దక్షిణ ఐరోపాలో దాదాపు రెండు నెలలుగా చెప్పుకోదగ్గ వర్షపాతం లేదు.నదులు ఎండిపోయాయి. అడవులు తగలబడిపోతున్నాయి. వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు 500 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత కరువు ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఎప్పుడూ కళకళలాడే నదుల్లో ఇప్పుడు చుక్క నీరు కూడా లేకుండాపోయింది. ఎక్కడ చూసినా.. జలచరాల కళేబరాలతో, ఎండిన ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాలు.. మోడువారాయి. భారీ నీటి ప్రాజెక్టుల్లో కూడా నీరు లేకుండ అయిపోయాయి. సాగునీరు లేక వ్యవసాయం దెబ్బతింది. పశువులకు మేతలేక పాల దిగుబడి భారీగా పడిపోయింది. చివరకు తాగునీరు కూడా అందక ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు తాగునీటిపై కూడా ఆంక్షలు విధిస్తున్నాయి. తూర్పు ఆఫ్రికా, పశ్చిమ అమెరికాతో పాటు ఉత్తర మెక్సికోలోనూ దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నాయి.

యూరప్ లో శీతకాలంలో కురిసే మంచు వల్ల‌ వేసవి కాలం నాటికి నదులు నిండుగా పారుతుంటాయి. కానీ, ఈ సారి వాతావరణంలో వచ్చిన‌ మార్పులతో.. శీతాకాలంలో మంచు కురవడం తగ్గి నదులన్నీ పూర్తిగా ఎండిపోయాయని నిపుణులు చెప్తున్నారు.

బ్రిటన్‌లో కూడా ప్రభుత్వం నీటి వినియోగంపై ఆంక్షలు విధించింది. వర్షాలు లేక పోవడం తీవ్ర వడగాడ్పుల వల్ల దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాక అక్కడ నీటి వినియోగానికి ప్రభుత్వం పరిమితులు విధించింది. బ్రిటన్ లో తాగునీటికి కూడా ప్రజలు కటకటలాడుతున్నారు. ముఖ్య‍ంగా నైరుతి, తూర్పు, మధ్య ఇంగ్లాండ్‌ ప్రాంతాల్లో ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

First Published:  13 Aug 2022 6:49 AM GMT
Next Story