Telugu Global
International

అసలు ఎవరీ అరుణ..? రాజకీయాల్లోకి ఎలా వచ్చిందీ తెలుగు తేజం..?

అరుణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వెంట్రప్రగడ. ఆమె తల్లిదండ్రులు కాట్రగడ్డ హేమలత, వెంకట రామారావులు ఉద్యోగరీత్యా 1972లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

అసలు ఎవరీ అరుణ..? రాజకీయాల్లోకి ఎలా వచ్చిందీ తెలుగు తేజం..?
X

ప్రపంచ రాజకీయాల్లో భారతీయుల హవా నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు వాళ్లు బాగా రాణిస్తున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు ఆడపడుచు చరిత్ర సృష్టించింది. డెమోక్రాట్ల తరఫున తలపడి.. రిపబ్లికన్ల కంచుకోటలో అరుణ పాగా వేశారు. మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గెలిచి, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా కాట్రగడ్డ అరుణ మిల్లర్‌ నిలిచారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. నిజానికి ఆమెకు రాజకీయాలంటేనే అస్సలు ఆసక్తి లేదట. తానొక ఇంజినీర్‌నని.. రాజకీయ వేత్తను కానని 2010 ఎన్నికల సమయంలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా అవకాశమొచ్చినప్పుడే అరుణ తెలిపారు.

అరుణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వెంట్రప్రగడ. ఆమె తల్లిదండ్రులు కాట్రగడ్డ హేమలత, వెంకట రామారావులు ఉద్యోగరీత్యా 1972లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అప్పటికి ఏడేళ్లున్న అరుణ అక్కడే చదివి.. మిస్సోరి యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ఇక అమెరికాలోనే ఉద్యోగం నిర్వహిస్తూ తన స్నేహితుడు డేవ్ మిల్లర్‌ని వివాహం చేసుకున్నారు. మొదటి నుంచి సామాజిక సేవపై ఆసక్తి ఉండటంతో ఆమె ప్రజల మన్ననలు పొందేందుకు సమయం పట్టలేదు. పాతికేళ్ల ఉద్యోగానికి 2015లో స్వస్తి చెప్పారు.

2000లో అరుణ అమెరికా పౌరసత్వాన్ని పొంది.. ఆ ఏడాదే తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఆమె ఓటు వేసిన వ్యక్తులంతా ఓటమి పాలవుతుండటంతో భరించలేక డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తగా మారి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. ఈ క్రమంలో 2010లోనే ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా తిరస్కరించారు. భర్త స్ఫూర్తితో తొలిసారిగా పోటీ చేసిన ఎన్నికల్లోనే విజయం సాధించి మేరీల్యాండ్‌కు తొలి భారతీయ అమెరికన్‌ డెలిగేట్‌ అయ్యారు. 2014లోనూ రెండోసారి డెలిగేట్‌గా ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసిన తొలి మహిళ హిల్లరీ క్లింటన్‌ బృందంలో అరుణ కూడా ఒకరు కావడం విశేషం. అయితే 2018లో తొలిసారిగా ఆమె ఓటమి రుచి చూశారు. బైడెన్ అధ్యక్షుడిగా పోటీ చేసిన తరుణంలో అరుణ విరామం లేకుండా శ్రమించారు. అందుకేనేమో మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఉన్న బైడెనే అరుణ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. కమలా హ్యారిస్ సైతం ప్రచారంలో పాల్గొన్నారు.

First Published:  10 Nov 2022 1:17 PM GMT
Next Story