Telugu Global
International

అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగు వారి హవా..

తెలుగు సంపన్నులు అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. అమెరికా రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ను శాసించే స్థాయికి కొన్ని ప్రాంతాల్లో తెలుగు వారు చేరుకుంటున్నారు.

అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగు వారి హవా..
X

అమెరికాకు ప్రతి ఏడాది చదువు, ఉద్యోగం నిమిత్తం ఎందరో భారతీయులు వెళ్తున్నారు. వీరిలో చదువు నిమిత్తం వెళ్లిన వారు సైతం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడుతున్నారు. ఆ తరువాత వారు చేసే మొదటి పని సొంత గూడు ఏర్పాటు చేసుకోవడం. ఇక దశాబ్దాలుగా అక్కడ స్థిరపడిన వారు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సంపన్నులు అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. అమెరికా రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ను శాసించే స్థాయికి కొన్ని ప్రాంతాల్లో తెలుగు వారు చేరుకుంటున్నారు.

నిజానికి అమెరికన్లకు రియల్ ఎస్టేట్ రంగంపై పెద్దగా ఆసక్తి ఉండదు. వారంతా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సంపన్నులైన భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగు వారు రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారిస్తున్నారు. గతంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేది. తెలుగు వారు తాము సంపాదించిందంతా ఇండియాలోనే పెట్టుబడులు పెట్టేవారు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగం బాగా వృద్ధి చెందింది. కానీ, ఇప్పుడు మ‌న‌వాళ్లు అమెరికాలో సొంతిళ్లు కొనడమే కాదు.. అద్దెల ఆదాయాన్ని సైతం దృష్టిలో పెట్టుకుని ఇళ్లు కొంటున్నారు. ఇలా రియల్ ఎస్టేట్‌ను శాసిస్తున్న వారిలో తెలుగు వారే ఎక్కువ కావడం విశేషం.

భారతీయులు ఎక్కువగా ఉండే హ్యూస్టన్, ఆస్టిన్, డ‌ల్లాస్ తదితర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తెలుగు వారి హవా కొనసాగుతోంది. గతంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో భారతీయులు ప్రవేశించాలని యత్నించారు. కానీ మనవాళ్లు డీల్ క్లోజ్ చేయరన్న అపవాదు ఉండటంతో వెనుకబడిపోయారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా తెలుగు వాళ్లు రియల్ రంగంలో దూసుకుపోతున్నారు. నిర్మాణ రంగంలోనూ తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇక మున్ముందు కూడా అమెరికా రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగు వారు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

First Published:  7 Nov 2022 2:20 PM GMT
Next Story