Telugu Global
International

సిడ్నీ మాల్ కత్తిపోటు దాడిలో పెరిగిన మృతుల సంఖ్య.. అనుమానితుడు కాల్చివేత

సిడ్నీలోని బోండీ జంక్షన్ వెస్ట్‌ఫీల్డ్‌లో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలు, భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ దారుణం జ‌రిగింది.

సిడ్నీ మాల్ కత్తిపోటు దాడిలో పెరిగిన మృతుల సంఖ్య.. అనుమానితుడు కాల్చివేత
X

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారంనాడు దారుణం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో ప‌లువురిపై దాడి చేసిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. గాయపడిన మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. అనుమానితుడిని పోలీసులు కాల్చి చంపేశారు. దుండగుడు మాల్ లోకి వచ్చి రావడంతోనే కాల్పులు జరిపి, అనంతరం కత్తితో ప‌లువురిపై దాడి చేశాడ‌ని పోలీసులు చెబుతున్నారు.

సిడ్నీలోని బోండీ జంక్షన్ వెస్ట్‌ఫీల్డ్‌లో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలు, భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ దారుణం జ‌రిగింది. మాల్‌లో ఒక్కసారిగా కాల్పులు జ‌ర‌గ‌డంతో జనం భయంతో పరుగులు తీశారు. షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు ముందుగా కాల్పులు జరిపి తరువాత విచక్షణారహితంగా కత్తితో దాడి జరపడంతో ఆరుగురు మృతిచెందారు. కత్తిపోట్లకు గురైన వారిలో ఓ తల్లి, ఆమె తొమ్మిది నెలల చిన్నారి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి కత్తితో షాపింగ్ సెంటర్‌ చుట్టూ పరిగెత్తడం, గాయపడిన వ్యక్తులు నేలపై పడి ఉండటం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, దాడి వెనక ఉద్దేశం ఏంటనేది తెలియరాలేదు. అయితే పోలీసులు తక్షణం స్పందించి మాల్‌లోని జనాన్ని వెళ్లిపోమని హెచ్చరించి హంతకుడిని చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అతను మరణించాడు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని, బాధిత కుటుంబాల బాధ తనను కలిచివేస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రమేయం మాత్రమే ఉందని తెలుస్తోంది. అయితే అతనికి ప్రత్య‌క్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎవరన్నా సహకరించారా అన్న కోణంలో కూడా అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మాల్ చుట్టుపక్కల లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ ప్రాంతం నుండి దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.

First Published:  13 April 2024 5:23 PM GMT
Next Story