Telugu Global
International

బాధగా ఉంది. మా ప్రజలకు అంతిమంగా మంచే జరగాలి- క్రికెటర్

ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతోంది. శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టీస్ పై ఆందోళన చెందుతున్నారు.

బాధగా ఉంది. మా ప్రజలకు అంతిమంగా మంచే జరగాలి- క్రికెటర్
X

ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో ఇంధన కష్టాలు నానాటికి అధికమవుతున్నాయి. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఇంధనం కోసం రోజుల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి. చివరకు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ప్రాక్టీస్ కు వెళ్లేందుకు ఇంధనం లేక ఇబ్బంది పడుతున్నారు.

ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతోంది. శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టీస్ పై ఆందోళన చెందుతున్నారు. శ్రీలంకలో నెలకొన్న ఆందోళకర పరిస్థితుల నేపథ్యంలో అసలు శ్రీలంకలో ఈ సిరీస్ ను ఐసీసీ నిర్వహిస్తుందా లేక మరో చోటకు వేదిక మారుస్తుందా అన్నదానిపైన కూడా చర్చ నడుస్తోంది. శ్రీలంకలోనే టోర్నమెంట్ నిర్వహిస్తే ఆటగాళ్లకు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు వారిని మైదానానికి తీసుకెళ్లేందుకు అవసరమైన ఇంధనం దొరుకుతుందా లేదా అన్న దానిపై చర్చ నడుస్తోంది.

శ్రీలంకలో ఇంధన లోటు తమను ఏ విధంగా ప్రభావితం చేస్తోంది అన్న విషయాన్ని ఏఎన్ఐ వార్త సంస్థకు క్రికెటర్ కరుణరత్నే వివరించారు. తాను పెట్రోల్ సాధించడానికి రెండు రోజులపాటు క్యూ లైన్ లో నిలబడాల్సి వచ్చిందన్నారు. 10 వేల రూపాయలతో పెట్రోల్ కొనుగోలు చేశానని రెండు మూడు రోజుల వరకు ప్రాక్టీస్ కు వెళ్లేందుకు ఇది సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. దేశానికి అండగా నిలబడుతూనే తమ ఆటపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం తమకుందన్నారు. శ్రీలంక తదుపరి అధ్యక్షుడైనా మంచివారు వస్తారని ఆశిస్తున్నామని త్వరలోనే అంతా సర్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీలంక ప్రజలకు కచ్చితంగా ఆఖరికి మంచే జరుగుతుందని కరుణరత్నే ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ప్రాక్టీస్ మైదానానికి వెళ్లేందుకు ఇంధనం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి శ్రీలంకలో నెలకొన్న దుస్థితికి అడ్డం పడుతోంది. కష్టాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఇకపై రేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా నేషనల్ ఫ్యూయల్ పాసులను శనివారం నుంచి జారీ చేస్తోంది. ఈ పాసుల ద్వారా వాహనాలకు ఇంధనాన్ని అందజేస్తారు. వాహన నెంబర్, ఇతర వివరాల ఆధారంగా నేషనల్ ఐడెంటిటీ కార్డును అందజేసి దానికి క్యూఆర్ కోడ్ కేటాయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ లోని చివరి అంకెల ఆధారంగా తమ వంతు పెట్రోల్ ఎప్పుడు వస్తుందో వాహన యజమానులు ముందే తెలుసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెట్రోల్, డీజిల్ విషయంలో పర్యాటకులకు, విదేశీయులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక రంగానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటే విదేశీ మార‌కద్రవ్యం కూడా దేశంలోనికి వస్తుందని భావిస్తున్నారు.

ఇంధన లోటును అధికమించేందుకు పొరుగున ఉన్న భారత్ తో పాటు రష్యా తోనూ శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి జరిగితే దేశంలో ఇంధన కొరతను అధికమించవచ్చని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

First Published:  16 July 2022 12:44 PM GMT
Next Story