Telugu Global
International

సందిగ్ధంలో ఆసియా కప్.. చేతులెత్తేసిన శ్రీలంక

ఆరు దేశాల క్రీడాకారులు, ఇతర సిబ్బందికి హోటల్స్, రవాణా ఏర్పాటు చేయడం కష్టమవుతుందని.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా స్టేడియంలను రెడీ చేయడం కూడా వీలుపడదని ఏసీసీకి చెప్పింది.

సందిగ్ధంలో ఆసియా కప్.. చేతులెత్తేసిన శ్రీలంక
X

ప్రపంచ కప్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన టోర్నీ ఆసియా కప్. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఆసియా కప్ చివరి సారిగా 2018లో యూఏఈ వేదికగా నిర్వహించారు. 2020లో నిర్వహించాల్సిన ఆసియా కప్ కోవిడ్ కారణంగా రద్దు చేశారు. ఇక తాజాగా ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉన్నది.

శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఒకవైపు దేశంలో ఆందోళనలు జరుగుతున్నా.. ఆస్ట్రేలియా జట్టు ఆ దేశంలో పర్యటించింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నది. అయితే షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఆసియా కప్‌ను తాము నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. ద్వైపాక్షిక సిరీస్‌లను ఏదో ఒక విధంగా నిర్వహించాము. కానీ ఆరు దేశాలు పాల్గొనే ఆసియా కప్‌ను నిర్వహించలేమని ఏసీసీకి స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

ఆరు దేశాల క్రీడాకారులు, ఇతర సిబ్బందికి హోటల్స్, రవాణా ఏర్పాటు చేయడం కష్టమవుతుందని.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా స్టేడియంలను రెడీ చేయడం కూడా వీలుపడదని ఏసీసీకి చెప్పింది. దీంతో ఏసీసీ అధికారులు బంగ్లాదేశ్ వేదికగా నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్ బోర్డును సంప్రదించారు. అయితే తాము కూడా ఆసియా కప్ భారాన్ని మోయలేమని చెప్పారు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు, ఏసీసీ కలిసి బీసీసీఐ సాయం కోరాయి.

యూఏఈ వేదికగా ఆసియా కప్ నిర్వహించడానికి బీసీసీఐ సాయం చేయాలని కోరడంతో ప్రస్తుతం అక్కడి బోర్డుతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఏసీసీ టోర్నీ రీషెడ్యూల్ చేయనున్నట్లు సమాచారం. యూఏఈ వేదికగా ఆడటానికి మిగిలిన దేశాల బోర్డులు కూడా అంగీకారం తెలిపాయని ఏసీసీ అధికారి ఒకరు చెప్పారు.

First Published:  21 July 2022 11:35 AM GMT
Next Story