Telugu Global
International

సౌత్ కొరియాలో తొక్కిసలాట.. 150 మందికి పైగా మృతి

హాలోవీన్ వేడుకలు జరుగుతుండగా.. సమీపంలోని ఒక బార్‌కు సినిమా స్టార్ వచ్చారనే ప్రచారం జరిగింది. దీంతో వందలాది మంది అటు వైపుగా పరుగులు తీశారు.

సౌత్ కొరియాలో తొక్కిసలాట.. 150 మందికి పైగా మృతి
X

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘోరం సంభవించింది. ప్రతీ ఏడాది జరిగే హాలోవీన్ వేడుకల్లో ఈ సారి అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోని ఒక ఇరుకైన వీధిలో ఒక్కసారిగా వందలాది మంది ప్రజలు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 151 మంది మృతి చెందినట్లు నగర ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఒకేసారి భారీ ఎత్తున ప్రజలు రావడం, భయభ్రాంతులకు గురైన వాళ్లు కంగారుగా పరుగులు తీయడానికి ప్రయత్నించడంతో చాలా మంది కిందపడ్డారు. వెనుక వస్తున్న వాళ్లు ఏం జరుగుతుందో తెలియక.. కింద పడిన వారి మీద నుంచి పరుగులు తీశారు.

చాలా మంది కింద పడిన తర్వాత గుండె పోటుతో మృత్యువాత పడ్డారని సియోల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ చోయ్ సియాంగ్ బియోమ్ తెలియజేశారు. మృతి చెందిన వారిలో 19 మంది విదేశీయలు కూడా ఉన్నారని.. అయితే ఎవరు ఏ దేశానికి చెందిన వారో ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారని.. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ తొక్కిసలాటలో మరో 150 మందికి పైగా గాయపడినట్లుగా కూడా చెప్పారు. సంఘటన గురించి తెలుసుకున్న సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ ఇయోల్ విచారం వ్యక్తం చేశారు. ఇవ్వాళ (ఆదివారం) జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.

హాలోవీన్ వేడుకలు జరుగుతుండగా.. సమీపంలోని ఒక బార్‌కు సినిమా స్టార్ వచ్చారనే ప్రచారం జరిగింది. దీంతో వందలాది మంది అటు వైపుగా పరుగులు తీశారు. ఒక ఇరుకైన సందులో కొంత మంది కిందపడిపోయారు. అక్కడ తొక్కిసలాట మొదలైంది. ఇదే ఇంతటి ఘోర దుర్ఘటనకు కారణమని కొరియా మీడియా వార్తలు ప్రసారం చేసింది. గత మూడేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించడం లేదు. అయితే కరోనా నిబంధనలు సడలించడంతో ఈ సారి దాదాపు లక్ష మంది వేడుకలకు హాజరయ్యారు. వారాంతం కావడంతో విదేశీయులు కూడా భారీగానే తరలి వచ్చారు.

దుర్ఘటన జరిగిన తర్వాత వందలాది మృతదేహాలను ఫైర్, పోలీస్ డిపార్ట్‌మెంట్ అక్కడి నుంచి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారికి హెల్త్ డిపార్ట్‌మెంట్ అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. స్థానికులు కూడా గాయపడిన వారికి సేవ చేస్తూ కనిపించారు. దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షలను పూర్తిగా సడలించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఈ సంఘటన జరగడం గమనార్హం. మృతుల, బాధితుల బంధువులు వేలాదిగా సంఘటన స్థలానికి చేరుకుంటుండటంతో పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు.

First Published:  30 Oct 2022 4:32 AM GMT
Next Story