Telugu Global
International

ఎయిర్ షోలో చూపరుల కళ్లెదుటే రెండు విమానాల ఢీ..

అందరూ వైమానిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎయిర్ షోలో చూపరుల కళ్లెదుటే రెండు విమానాల ఢీ..
X

అమెరికాలో అంగరంగ వైభవంగా 'వింగ్స్‌ ఓవర్‌ డాలస్‌' అనే వైమానిక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో సడెన్‌గా ఊహించని దారుణం చోటు చేసుకుంది. వైమానిక ప్రదర్శనలో భాగంగా గాల్లో ఎగురుతున్న రెండు పాత యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. డాలస్‌ నగరానికి 10మైళ్ల దూరంలో ఉన్న డాలస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది కన్నుమూశారు. అందరూ వైమానిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే యుద్ధ విమానాలను పూర్తిగా సుశిక్షితులైన వలంటీర్లు నడిపారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డాలస్ మేయర్ ఎరిక్ జాన్సన్ మాట్లాడుతూ.. జాతీయ రవాణా భద్రత బోర్డు(ఎన్‌టీఎస్‌బీ) రంగంలోకి దిగి స్థానిక పోలీసులకు, సహాయక సిబ్బందికి సాయం చేసిందన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోందని ట్విట్ట‌ర్ వేదికగా ఎరిక్ జాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢీకొన్న విమానాల్లో ఒకటి.. పీ-63 కింగ్‌కోబ్రా యుద్ధవిమానం కాగా.. మరొకటి బీ-17 ఫ్లైయింగ్ ఫోర్‌ట్ర‌స్‌ విమానం. ఈ బీ-17 విమానమే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ దేశ అమ్ముల పొదిలో కీలక అస్త్రంగా వ్యవహరించింది.

వీటి సహాయంతోనే జర్మనీపై దాడులకు పాల్పడింది. పాత విమానాలతో చేసే ఎయిర్‌ షోల్లో భద్రత విషయమై చాలా కాలంగా అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గతంలో ఈ ఎయిర్ షోల్లోనే చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2011లో నెవాడాలో నిర్వహించిన ఎయిర్‌ షోలో పీ-51 మస్టాంగ్‌ విమానం ఏకంగా షో తిలకించేందుకు వచ్చిన వారిపైనే కుప్ప కూలింది. ఆ సమయంలో 11 మంది మరణించారు. ఇలా గతంలో జరిగిన ప్రమాదాలు చాలానే ఉన్నాయి.

First Published:  14 Nov 2022 6:57 AM GMT
Next Story