Telugu Global
International

అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి కుమార్తె మృతి

రంగారెడ్డి జిల్లా కోర్టులో అడిషనల్ జిల్లా జడ్జిగా పని చేస్తున్న తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య.. కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే ఉన్నత విద్యను అభ్యసించింది.

అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి కుమార్తె మృతి
X

అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఒక మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో హైదరాబాద్ సరూర్‌నగర్‌కు చెందిన యువతి ఐశ్వర్య (27) ఉన్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడిషనల్ జిల్లా జడ్జిగా పని చేస్తున్న తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య.. కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే ఉన్నత విద్యను అభ్యసించింది. చదువు పూర్తి చేసిన అనంతరం ఉద్యోగం రావడంతో అక్కడే ఉంటోంది.

శనివారం మధ్యాహ్నం 3.30 గంటల (అమెరికా కాలమానం) సమయంలో డాలస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్ ప్రీమియర్ మాల్‌లో షాపింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో నల్లరంగు కారులో వచ్చిన దుండగుడు.. బయటి నుంచే కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఐశ్వర్య సహా 8 మంది మృతి చెందారు. ఐశ్వర్య దగ్గర నుంచి ఐడీ కార్డు సాయంతో ఆమెను గుర్తించి.. హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఐశ్వర్య మృతితో కొత్తపేటలోని ఆమె ఇంటి వద్ద విషాద చాయలు అలుముకున్నాయి. జిల్లా కోర్టులో జడ్జీగా నర్సిరెడ్డి చాలా మందికి పరిచయం. చదవులు నిమిత్తం వెళ్లి.. ఉద్యోగం కూడా చేస్తున్న తమ కూతురు ఇలా దుండగుడి కాల్పుల్లో చనిపోవడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

First Published:  8 May 2023 6:15 AM GMT
Next Story