Telugu Global
International

పిల్లి కూన అని పెంచుకుంటే.. విస్తుపోయే నిజం వెలుగులోకి..

రష్యాకు చెందిన సదరు మహిళ గతంలో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా.. చెట్ల పొదల్లో అచేతనావస్థలో రోజుల వయసున్న ఓ పసి కూన కనిపించింది.

పిల్లి కూన అని పెంచుకుంటే.. విస్తుపోయే నిజం వెలుగులోకి..
X

ఓ జంతు ప్రేమికురాలు పిల్లి కూన అనుకొని చేరదీసి పెంచితే.. ఆ తర్వాత అది బ్లాక్‌ పాంథర్‌ (నల్ల చిరుత) అని తెలిసింది. దీంతో ఆమె షాక్‌కు గురైంది. రష్యాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సదరు మహిళ తాను పెంచుకుంటున్న బ్లాక్‌ పాంథర్‌తో అనుబంధాన్ని, ఆసక్తికరమైన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ తనను ఫాలో అవుతున్నవారిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రష్యాకు చెందిన సదరు మహిళ గతంలో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా.. చెట్ల పొదల్లో అచేతనావస్థలో రోజుల వయసున్న ఓ పసి కూన కనిపించింది. దానిని పిల్లి పిల్ల అనుకున్న ఆమె తన వెంట తీసుకెళ్లి సపర్యలు చేసింది. తన పెంపుడు కుక్కతో పాటే దానికి ఆహారం అందించి ఆద‌రించింది. అయితే.. కొన్ని రోజులకు ఆమెకు అసలు విషయం తెలిసి కంగుతింది. అనంతరం సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. అది పిల్లి కాదని, బ్లాక్‌ పాంథర్‌ (నల్ల చిరుత) అని గ్రహించి ఆశ్చర్యానికి గురైంది. అనంతరం దాన్ని తనతోపాటే ఉంచుకొని అనుబంధం పెంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

తొలుత బ్లాక్‌ పాంథర్‌ దొరికిన స్థితి నుంచి అది పెరిగి పెద్దదై.. తన పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటున్న దృశ్యాల వరకు అన్నింటినీ కలిపిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఆ వీడియోకు తెగ లైక్‌లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్‌ రావడం గమనార్హం. దీంతో పాటు ఆ మహిళ తన పెంపుడు కుక్క, బ్లాక్‌ పాంథర్‌తో తనకున్న అనుబంధాన్ని చాటేలా వీడియోలు పోస్ట్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆ ఖాతాను 35 లక్షల మంది అనుసరిస్తున్నారంటే.. ఆమె వీడియోలకు ఎంత క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

First Published:  26 Sep 2023 6:48 AM GMT
Next Story