Telugu Global
International

శ‌క్తివంత‌మైన ఆయుధాల త‌యారీకి ఏఐ దోహ‌దం.. - బ్రిట‌న్ ప్ర‌ధాని స‌ల‌హాదారు మ్యాట్ క్లిఫ‌ర్డ్ ఆందోళ‌న‌

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో నియంత్రించ‌కుంటే.. మాన‌వుడు నియంత్రించ‌లేని శ‌క్తిమంత‌మైన వ్య‌వ‌స్థ ఏర్పాటుకు దారితీస్తుంద‌ని వివ‌రించారు.

శ‌క్తివంత‌మైన ఆయుధాల త‌యారీకి ఏఐ దోహ‌దం.. - బ్రిట‌న్ ప్ర‌ధాని స‌ల‌హాదారు మ్యాట్ క్లిఫ‌ర్డ్ ఆందోళ‌న‌
X

అనేక‌మంది ప్రాణాలు తీసే శ‌క్తిమంత‌మైన ఆయుధాల త‌యారీకి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ దోహ‌ద‌ప‌డుతుంద‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ స‌ల‌హాదారు మ్యాట్ క్లిఫ‌ర్డ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎన్నో ప్రాణాలు తీయగల సైబర్, బయోలాజికల్ ఆయుధాలను సృష్టించే సామర్థ్యం కృత్రిమ మేధ AI కి ఉంద‌ని ఆయ‌న‌ వివ‌రించారు. క్లిఫర్డ్.. చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి కృత్రిమ మేధ‌ మోడల్స్‌పై పరిశోధన కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ మోడల్ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్ ఇన్వెన్షన్ ఏజెన్సీ చైర్మన్ గానూ ఉన్నారు.

తాజాగా ఆయ‌న ఓ మీడియా ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో నియంత్రించ‌కుంటే.. మాన‌వుడు నియంత్రించ‌లేని శ‌క్తిమంత‌మైన వ్య‌వ‌స్థ ఏర్పాటుకు దారితీస్తుంద‌ని వివ‌రించారు. ఏఐతో స్వల్ప, దీర్ఘకాలికంగా ఎన్నో రకాల ముప్పులు పొంచివున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. జీవాయుధాలు లేదా భారీ సైబర్ దాడులను చేసేందుకు అవసరమైన సాంకేతికత కోసం ఏఐని ఇప్పుడు వాడుకోవచ్చని తెలిపారు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవని వివ‌రించారు.



చాట్ జీపీటీ వంటివాటితో మాన‌వాళికే పెను ముప్పు..

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టెక్నాల‌జీతో వ‌స్తున్న చాట్ జీపీటీ వంటి వ్య‌వ‌స్థ‌లు యావత్ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థల అధిపతులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా వ్యవస్థల అభివృద్ధిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతూ అనేక మంది నిపుణులు బహిరంగ లేఖ రాశారు. అందులో ఎలాన్ మస్క్ వంటి కీలక వ్యక్తులు సంతకాలు చేశారు. దీన్ని సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని అటు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధ దుష్ప్రభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆయ‌న అన్నారు.

First Published:  7 Jun 2023 1:46 AM GMT
Next Story