Telugu Global
International

బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయుడి దూకుడు

మూడో రౌండ్‌లో రిషి సునక్‌కు 115 ఓట్లు పోలయ్యాయి. ఇతర అభ్యర్థుల కంటే పార్లమెంటులో రిషి అభ్యర్థిత్వం వైపే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుండటం గమనార్హం.

బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయుడి దూకుడు
X

బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కన్జర్వేటీవ్ పార్టీ కొత్త అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావహులు ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే మిగిలిన వారికంటే భారత సంతతికి చెందిన రిషి సునక్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు రౌండ్లలో మెజార్టీ సాధించిన సునక్.. తాజాగా మూడో రౌండ్‌లోనూ అత్యధిక ఓట్లు సాధించారు. ఈ క్రమంలో మిగిలిన అభ్యర్థులను వెనక్కు నెట్టి తిరుగులేని మెజార్టీ వైపు దూసుకెళ్తున్నారు.

బ్రిటన్ పార్లమెంటులో బోరిస్ జాన్సన్ వారసుడి ఎంపిక కోసం రౌండ్ల వారీగా పోలింగ్ జరుగుతున్నది. పోటీలో పలువురు అభ్యర్థులు ఉండటంతో పోలింగ్ అనివార్యం అయ్యింది. మూడో రౌండ్‌లో రిషి సునక్‌కు 115 ఓట్లు పోలయ్యాయి. ఇతర అభ్యర్థుల కంటే పార్లమెంటులో రిషి అభ్యర్థిత్వం వైపే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుండటం గమనార్హం. ఇక 82 ఓట్లతో బ్రిటన్ మాజీ రక్షణ మంత్రి పెన్నీ మెర్డాంట్ రెండో స్థానంలో నిలిచారు. విదేశాంగ శాఖ మాజీ మాంత్రి లిజ్ ట్రాస్‌కు 71 ఓట్లు, కెమ్మి బెడెనోచ్‌కు 58, టామ్ టుగెండ్హట్‌కు అతి తక్కువగా 31 ఓట్లు లభించాయి. అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన టామ్ టుగెండ్హట్‌ రేసు నుంచి తప్పుకోవల్సి వచ్చింది.

ప్రధాని పదవికి పోటీ పడేందుకు చివరిగా ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు పలు రౌండ్ల పోలింగ్ నిర్వహిస్తారు. మూడో రౌండ్‌లో గెలిచిన అభ్యర్థుల నుంచి మరొకరిని తప్పించేందుకు మంగళవారం మరో రౌండ్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు పోలింగ్ చాలా కీలకం కానున్నది. ఇవాళ రిషి సునక్‌తో పాటు పెన్నీ మోర్డాంట్, లిజ్ ట్రాస్, కెమ్మి బెడెనొచ్ పోటీ పడనున్నారు.

రిషి సునక్‌కు పార్లమెంటులో మద్దతు బాగానే ఉన్నా.. పెన్నీ మోర్డాంట్ నుంచి మాత్రం గట్టి పోటీ ఎదురవుతున్నది. అయితే తొలి రెండు రౌండ్లలో పెన్నీ ఢీ అంటే ఢీ అనే విధంగా సునక్‌కు పోటీ ఇచ్చారు. కానీ మూడో రౌండ్‌లో ఆయనకు చాలా వరకు ఓట్లు తగ్గిపోయాయి. రెండో రౌండ్‌లో వందకు పైగా ఓట్లు వచ్చినా.. పెన్నీకి మూడో రౌండ్‌లో 81కే పరిమితం అయ్యారు. మరోవైపు రిషికి ఆ మేరకు ఓటింగ్ పెరిగింది. దీంతో సునక్‌కు క్రమంగా ఆదరణ పెరగుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.

ప్రధాని అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న రిషి సునక్ మొదటి నుంచి పార్లమెంట్ ఓటింగ్‌లో దూకుడుగానే ఉన్నారు. ప్రతీ రౌండ్‌కు తన ఓట్లు పెంచుకుంటున్నారు. దీంతో ఇతర అభ్యర్థులు అతని దరిదాపులోకి రాలేకపోతున్నారు. బోరిస్ వారసుడిగా రిషి సునక్ ఎన్నిక కావడం దాదాపు ఖాయమే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రిటిష్ మీడియా కూడా సునక్‌ను సరైన అభ్యర్థిగా అంచనా వేస్తోంది.

రిషి సునక్ మూడో రౌండ్‌లో 115 ఓట్లు సాధించారు. ప్రధానిగా ఎన్నిక కావాలంటే కన్జర్వేటీవ్ పార్టీకి చెందిన 120 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. తర్వాతి రౌండ్లలో సునక్ ఆ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే బ్రిటన్‌కు ప్రధాని అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా సునక్ చరిత్ర సృష్టించడం ఖాయమే.

First Published:  19 July 2022 2:31 AM GMT
Next Story