Telugu Global
International

భార‌త్ యంగ్ టాలెంట్స్ కు బ్రిట‌న్ తీపి క‌బురు..యేటా 3వేల వీసాల జారీ!

జీ20 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలుసుకున్న కొద్ది సేప‌టికే బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

భార‌త్ యంగ్ టాలెంట్స్ కు బ్రిట‌న్ తీపి క‌బురు..యేటా 3వేల వీసాల జారీ!
X

భార‌త్ లోని యువ నిపుణుల‌కు బ్రిట‌న్ ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. వీరికి ప్ర‌తీ యేడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు అంగీక‌రిస్తూ బ్రిట‌న్ ప్ర‌బుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలుసుకున్న కొద్ది సేప‌టికే బ్రిటన్ ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

గత ఏడాది అంగీకరించిన యూకె-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ పథకం లో ప్రయోజనం పొందిన మొదటి దేశం భారతదేశమే అని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొంది.

యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్ పథకం కింద 18-30 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన భారత పౌరులు యూకే వచ్చి రెండేళ్లపాటు ఉండేందుకు 3 వేల వీసాలను అందిస్తున్నట్టు యూకే ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్‌లో పేర్కొంది. ప్రధానిగా బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కిన సునాక్.. మోడీని కలవడం ఇదే తొలిసారి.

జీ20 సమ్మిట్‌లో యూకే, భారత ప్రధానులు కలుసుకుని మాట్లాడినట్టు మోడీ కార్యాలయం ట్వీట్ చేసింది. "ఈ పథకం ప్రారంభం భారతదేశంతో మా ద్వైపాక్షిక సంబంధాలకు, మ‌న రెండు ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి యుకె విస్తృత నిబద్ధతకు నివ‌ద‌ర్శ‌నం" అనిబ్రిట‌న్ పిఎం కార్యాల‌యం ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిట‌న్ ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. ఒకవేళ అంగీకారం కుదిరిన‌ట్ల‌యితే , ఇది ఒక యూరోపియన్ దేశంతో భారతదేశం చేసుకున్న మొదటి ఒప్పందం అవుతుంది.

First Published:  16 Nov 2022 8:30 AM GMT
Next Story