Telugu Global
International

నన్ను గెలిపించండి.. సంక్షోభం నుంచి గట్టెక్కిస్తా : రిషి సునాక్

ప్రధాని రేసులో మరోసారి ఉండనున్నట్లు రిషి సునక్ ఆదివారం ప్రకటించారు. పార్టీని ఏకం చేసి.. అందరి మద్దతుతో తాను ప్రధాని అవ్వాలని అనుకుంటున్నానని, ఆర్థిక పరిస్థితులను కూడా చక్కదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.

నన్ను గెలిపించండి.. సంక్షోభం నుంచి గట్టెక్కిస్తా : రిషి సునాక్
X

బ్రిటన్ ప్రధానిగా తనను గెలిపిస్తే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తానని, అందుకు ఏం చేయాలో తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని రిషి సునాక్ అన్నారు. భారత సంతతికి చెందిన రిషి.. రెండు నెలల క్రితం జరిగిన కన్జర్వేటీవ్ పార్టీ ఎన్నికల్లో ప్రతినిధుల మద్దతు లేక ప్రధాని పదవిని పోగట్టుకున్నారు. ఆనాడు గెలిచిన లిజ్ ట్రస్.. ప్రధాని పదవిలో కేవలం 45 రోజులు మాత్రమే ఉండి.. తాను దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేయటంలో విఫలమయ్యానని చెప్పి రాజీనామా చేశారు. దీంతో మరో వారం పది రోజుల్లో బ్రిటన్‌కు కొత్త ప్రధానికి ఎన్నుకోవల్సిన అవసరం ఏర్పడింది.

ప్రధాని రేసులో మరోసారి ఉండనున్నట్లు రిషి సునక్ ఆదివారం ప్రకటించారు. పార్టీని ఏకం చేసి.. అందరి మద్దతుతో తాను ప్రధాని అవ్వాలని అనుకుంటున్నానని, ఆర్థిక పరిస్థితులను కూడా చక్కదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. గతంలో తాను అర్థిక మంత్రిగా పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత అనుభవం తనకు చక్కగా ఉపయోగపడుతుందని ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అందరూ అంచనా వేస్తున్న వాటికంటే మరిన్ని కఠిన సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని, అందుకే కన్జర్వేటీవ్ పార్టీ సభ్యులు తీసుకునే నిర్ణయం భవిష్యత్ తరాల తల రాత మార్చేలా ఉండాలని సునాక్ పిలుపునిచ్చారు.

ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు తర్వాతి తరం వారికి ఎక్కువ అవకాశాలు తెచ్చిపెట్టేలా ఉండాలని ఆయన అన్నారు. పార్టీ నాయకుడిగా, ప్రధానిగా తాను ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తానని, సమస్యలను పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. కాగా, రిషి సునాక్‌కు పోటీగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఆయన తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, గత ఎన్నికల సమయంలో రిషి సునాక్‌ను ఓడించడానికి బోరిస్ పని చేశారు. ఇప్పుడు కూడా తాను బరిలో నిలిచి.. కన్జర్వేటీవ్ పార్టీలో ఆయనకు మద్దతు లేకుండా చేయాలని భావిస్తున్నారు.

First Published:  23 Oct 2022 1:44 PM GMT
Next Story