Telugu Global
International

ఐటీలో కొత్త ఉద్యోగాలు లేనట్టే..! ఇప్పుడంతా క్వైట్ హైరింగ్

కొత్త వారిని నియమించుకోకుండా, కంపెనీలోనే కావాల్సిన నైపుణ్యాలున్న ఉద్యోగిని కనిపెట్టడాన్నే క్వైట్‌ హైరింగ్‌ అంటున్నారు. సంస్థలో అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్‌.

ఐటీలో కొత్త ఉద్యోగాలు లేనట్టే..! ఇప్పుడంతా క్వైట్ హైరింగ్
X

మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది ఐటీ ఉద్యోగుల పరిస్థితి. లేఆఫ్ లతో సతమతం అవుతున్నవారికి ఇతర సంస్థల్లో కొత్త ఉద్యోగాలు లేవు, లేదా ఖాళీగా ఉన్న పోస్ట్ ల భర్తీ ఉండదు అనేది షాకింగ్ న్యూస్ గా మారింది. క్వైట్ హైరింగ్ పేరుతో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఉన్నవారినే భర్తీ చేస్తున్నారు. దీనివల్ల కొత్త వారికి అవకాశాలు రాకపోవడంతో పాటు, పాతవారిపై ఒత్తిడి మొదలవుతోందని తెలుస్తోంది.

కొత్త వారిని నియమించుకోకుండా కంపెనీలోనే కావాల్సిన నైపుణ్యాలున్న ఉద్యోగిని కనిపెట్టడాన్నే క్వైట్‌ హైరింగ్‌ అంటున్నారు. సంస్థలో అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్‌. కంపెనీలో ఉద్యోగుల కొరత ఉండి, టార్గెట్‌ లు అందుకోవడానికి టైమ్ దగ్గరపడుతున్నప్పుడు ఈ క్వైట్‌ హైరింగ్‌ ఉపయోగకరంగా ఉంటుందని టెక్నికల్‌ కన్సల్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పుడిది కష్టకాలంలో కూడా కంపెనీలకు పనికొస్తోంది. కొత్త ఉద్యోగుల్ని నియమించుకోకుండా కాస్ట్ కటింగ్ కి తోడ్పడుతోంది.

ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులకు కొత్త విధులు అప్పగించడంతోపాటు.. అవసరమైతే వారికి ఆయా విభాగాల్లో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇలా కంపెనీలో అప్పటికే ఉన్న నిపుణులను అత్యవసర విభాగాల్లో ఉపయోగించుకోవడం, ఉత్పాదకత లేని విభాగాల్లోని వారిని తగ్గించుకోవడం.. వంటివి అంతిమంగా ఆయా సంస్థలకు ఉపయోగకరంగా ఉంటున్నాయని చెబుతున్నారు.

ముఖ్యంగా హెచ్ఆర్, మార్కెటింగ్ విభాగాల్లో ఉండే వారికి ఇలాంటి క్వైట్ హైరింగ్ ద్వారా కొత్త పనులు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. అటు తమ విభాగాల విధులతోపాటు, కొత్త విధులు కూడా వారు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త ట్రెండ్‌ ఉద్యోగులకు కూడా ఉపయోగం అంటున్నారు నిపుణులు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంతోపాటు, టాలెంట్‌ నిరూపించుకునేందుకు ఇదో అవకాశం అని చెబుతున్నారు. బోనస్‌లు, జీతం పెంపు వంటి విషయాల్లో క్వైట్ హైరింగ్ ద్వారా అదనపు బాధ్యతలు మోసేవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయట కంపెనీలు. అయితే అంతిమంగా ఇది కొత్త ఉద్యోగుల కడుపుకొట్టే పనేనని అంటున్నారు. కొత్త నియామకాలు మరింతగా తగ్గిపోతాయని చెబుతున్నారు.

First Published:  27 Feb 2023 11:50 AM GMT
Next Story