Telugu Global
International

ఎలిజిబెత్ రాణి లేఖ, 2085 వరకు చదివే వీల్లేదు.. ఎందుకో తెలుసా..?

ఎలిజిబెత్ -2 కి ఆస్ట్రేలియాతో అవినాభావ సంబంధం ఉంది. ఆమె 16 సార్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. 1986, నవంబర్‌ లో ఎలిజబెత్-2 ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రజలను ఉద్దేశించి ఓ లేఖను తన స్వహస్తాలతో రాశారు.

ఎలిజిబెత్ రాణి లేఖ, 2085 వరకు చదివే వీల్లేదు.. ఎందుకో తెలుసా..?
X

కొంతమంది తాము చనిపోయిన తర్వాత జరగాల్సిన పనుల్ని వీలునామాలో రాస్తుంటారు. ఫలానా సంవత్సరంలోనే వీలునామా ఓపెన్ చేయాలని, అప్పటి వరకూ ఫలానా వారి సంరక్షణలో ఆస్తి ఉంటుందనే నిబంధన పెట్టేవారు కూడా ఉంటారు. ఇలాంటి లేఖనే బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్-2 కూడా రాశారని తెలుస్తోంది. సిడ్నీ ప్రజల్ని ఉద్దేశించి ఆమె రాసిన ఆ లేఖను 2085 వరకు తెరవడానికి లేదని షరతు విధించారట. ఆ లేఖను 2085లో ఓ మంచి సందర్భం చూసి తెరచి చదవాలని, తన సందేశాన్ని సిడ్నీ వాసులకు వినిపించాలని కోరారట ఎలిజిబెత్-2. ఆమె మరణం తర్వాత ఇప్పుడీ లేఖ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

ఎలిజిబెత్ -2 కి ఆస్ట్రేలియాతో అవినాభావ సంబంధం ఉంది. ఆమె 16 సార్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. 1986, నవంబర్‌ లో ఎలిజబెత్-2 ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రజలను ఉద్దేశించి ఓలేఖను తన స్వహస్తాలతో రాశారు. ప్రస్తుతం దానిని సిడ్నీలోని క్వీన్‌ విక్టోరియా భవనంలో ఓ రహస్య ప్రదేశంలో భద్రపరిచారు. అయితే, అందులో ఏముందో ఆమెకు మినహా ఎవరికీ తెలియదు. ఆమె ఇప్పుడు లేరు, కానీ ఆ లేఖను ఓపెన్ చేసి చదవడం కుదరని పని. ఎందుకంటే ఆ లేఖను 2085 వరకు ఓపెన్ చేయకూడదని ఆమే స్వయంగా షరతు పెట్టారు. '2085లో తగిన రోజు చూసుకొని ఈ లేఖను తెరవండి. సిడ్నీ ప్రజలకు నా సందేశాన్ని చేరవేయండి' అంటూ ఆనాటి సిడ్నీ మేయర్‌ ను ఉద్దేశించి రాణి ఆ లేఖను పంపించినట్టు తెలుస్తోంది. లేఖపై ఆమె సంతకం కూడా ఉంది.

లేఖలో ఏముంది..?

2085లోనే ఆ లేఖను ఓపెన్ చేయాలి అని స్పష్టమైన నిబంధన పెట్టారంటే.. ఆ సంవత్సరానికి ఆ లేఖకు ఏమైనా సంబంధం ఉంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రాణి బతికి ఉన్నప్పుడు ఈ లేఖ గురించి పెద్దగా చర్చ రాలేదు. ఆమె మరణం తర్వాత ఇప్పుడీ లేఖ విషయం ఆసక్తికరంగా మారింది. ఆమెకు మినహా అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆమె ఇప్పుడు లేరు, అంటే 2085 వరకు ఆ సస్పెన్స్ వీడే అవకాశమే లేదు. ఆస్ట్రేలియాకు సంబంధించినంత వరకు బ్రిటన్ రాణి వదిలి వెళ్లిన జ్ఞాపకాల్లో ఇది అరుదైనది. అందుకే ఆ లేఖను వారు అత్యంత రహస్య ప్రదేశంలో ఉంచి భద్రంగా చూసుకుంటున్నారు.

First Published:  13 Sep 2022 2:18 AM GMT
Next Story