Telugu Global
International

భూకంపంతో వ‌ణికిపోయిన మొరాకో.. 632 మంది మృతి

విప‌త్తుకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు నిండిపోయాయి.

భూకంపంతో వ‌ణికిపోయిన మొరాకో.. 632 మంది మృతి
X

శుక్ర‌వారం రాత్రి చోటుచేసుకున్న తీవ్ర భూకంపంతో ఆఫ్రికా దేశం మొరాకో చిగురుటాకులా వ‌ణికిపోయింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 6.8గా న‌మోదైంది. ఈ విప‌త్తులో ఇప్ప‌టివ‌ర‌కు 632 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొరాకో ప్రభుత్వం ప్రాథమికంగా వెల్లడించిన నివేదిక ప్రకారం.. అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర‌త ఎక్కువ‌గా క‌నిపించింది. అత్య‌ధిక మరణాలు కూడా అక్క‌డే సంభవించాయి. ఈ ప్ర‌కృతి విప‌త్తులో మ‌రో 300 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. 'అకస్మాత్తుగా భూమి కంపించడంతో భవనాలు కదిలిపోవడం కనిపించింద‌ని, దాంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారని ప్ర‌త్య‌క్ష సాక్షి ఒక‌రు మీడియాకు వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని, దీంతో 10 నిమిషాల పాటు తాము అంధ‌కారంలోనే ఉండిపోయామ‌ని చెప్పారు.

విప‌త్తుకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు నిండిపోయాయి. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని చవిచూడలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఈ విపత్తు సృష్టించిన విధ్వంసం దృశ్యాలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. మొరాకోలో భూకంపంపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ భూకంపం వల్ల వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్ర‌ధాని ప్రకటించారు.

First Published:  9 Sep 2023 8:20 AM GMT
Next Story