Telugu Global
International

ఉక్రెయిన్ శాంతిపై మోదీ ప్రసంగం.. మణిపూర్ సంగతేంటని కౌంటర్లు

మణిపూర్ అల్లర్లను చల్లార్చడానికి కనీస ప్రయత్నం చేయని మోదీ, ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్టేట్ మెంట్లివ్వడం నిజంగా హాస్యాస్పదం.

ఉక్రెయిన్ శాంతిపై మోదీ ప్రసంగం.. మణిపూర్ సంగతేంటని కౌంటర్లు
X

ఉక్రెయిన్ శాంతిపై మోదీ ప్రసంగం.. మణిపూర్ సంగతేంటని కౌంటర్లు

భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. అనుకున్నట్టుగానే పరస్పరన పొగడ్తలతో జరుగుతోంది. అయితే తాజాగా ఉక్రెయిన్ యుద్ధం-శాంతి గురించి మోదీ చేసిన ప్రసంగం మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతోంది. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు ఏ విధమైన సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. అలా అన్నారో లేదో ఇలా నెటిజన్లు ఆయనపై కౌంటర్లు వేశారు. ముందు మణిపూర్ సంగతి చూడాలని హితవు పలికారు.


ఉక్రెయిన్ బాగోగుల గురించి మోదీ ఆవేదన చెందడాన్ని ఎవరూ కాదనరు. కానీ దేశంలో మణిపూర్ రాష్ట్రం అల్లర్లతో అట్టుడికిపోతుంటే, ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, ఆస్తి నష్టం జరుగుతుంటే ఒక్క మాటైనా మాట్లాడని మోదీ, అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా ప్రసంగించడం మాత్రం ఆశ్చర్యంగా తోస్తుంది. మణిపూర్ అల్లర్లను చల్లార్చడానికి కనీస ప్రయత్నం చేయని మోదీ, ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్టేట్ మెంట్లివ్వడం నిజంగా హాస్యాస్పదం.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో తాజా సమావేశం అనంతరం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు మోదీ. ఉక్రెయిన్‌ లో యుద్ధం ప్రారంభం నుంచి.. చర్చలు, దౌత్యం ద్వారా వివాద పరిష్కారానికి భారత్ ప్రాధాన్యతనిస్తోందన్నారు మోదీ. ఉక్రెయిన్‌ లో శాంతి పునరుద్ధరణకు సహకారం అందిస్తామన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు నిరంతరం మానవతా సహాయం అందిస్తామని భారత్-అమెరికా సంయుక్తంగా ప్రతిజ్ఞ చేశాయి. ఉక్రెయిన్‌ లో సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం ప్రారంభించాలన్నారు మోదీ, బైడెన్. అయితే ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలని, ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచించాలంటూ మణిపూర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు మోదీని ఓ ఆట ఆడేసుకున్నారు.

First Published:  23 Jun 2023 11:08 AM GMT
Next Story