Telugu Global
International

శవాల దిబ్బగా మారిన లిబియా.. 5,300 మంది మృతి, 10 వేలమంది గల్లంతు

సముద్రానికి చేరువలో ఉన్న డెర్నా నగరంలో ఊహ‌కంద‌ని విషాదం నెలకొంది. ఆ నగరం లోయలో ఉండగా, ఎగువనున్న‌ పర్వతాల్లో రెండు డ్యామ్‌లున్నాయి. అవి రాత్రి వేళ బద్దలు కావడంతో అనూహ్య ప్రమాదం జ‌రిగింది.

శవాల దిబ్బగా మారిన లిబియా.. 5,300 మంది మృతి, 10 వేలమంది గల్లంతు
X

తూర్పు లిబియాలో వరద బీభత్సం ఇప్పటివరకు 5,300 మందిని బలి తీసుకుంది. ఈ జల విలయంలో సుమారు 10 వేల మంది గల్లంతయ్యారని లిబియా అధికార యంత్రాంగం ప్రకటించింది. విపత్తు సంభవించిన 36 గంటల తర్వాత కూడా భారీగా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే రెస్క్యూ టీమ్స్‌ 1,500 మృతదేహాలను వెలికితీశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


సముద్రానికి చేరువలో ఉన్న డెర్నా నగరంలో ఊహ‌కంద‌ని విషాదం నెలకొంది. ఆ నగరం లోయలో ఉండగా, ఎగువనున్న‌ పర్వతాల్లో రెండు డ్యామ్‌లున్నాయి. అవి రాత్రి వేళ బద్దలు కావడంతో అనూహ్య ప్రమాదం జ‌రిగింది. దాదాపు 1.25 లక్షల కుటుంబాలు నివాసముండే డెర్నాలో ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. కార్లు నీళ్లలో తేలుతూ కొట్టుకుపోయాయి. ఆ సమయంలో నిద్రలో ఉన్న ప్రజలంతా వరదలో చిక్కుకొని సముద్రంలోకి కొట్టుకుపోయారు. వీధులలో పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. కొన్ని మృతదేహాలు ఆ బురదలో కూడా ల‌భ్య‌మ‌వుతున్నాయి. రోడ్లపైన, ఆసుపత్రి ప్రాంగణాల్లో ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి.



సహాయ కార్యక్రమాల కోసం టర్కీ సహా ఇతర దేశాలు తమ బృందాలను లిబియా పంపాయి. అలాగే ఈజిప్ట్, జర్మనీ, ఇరాన్, ఇటలీ, ఖతర్, తుర్కియేలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు.

తుపాను, గాలి వేగం, భారీ వర్షాలు, సముద్ర మట్టం, వరదలపై ఎలాంటి శాస్త్రీయ అంచనాలు, హెచ్చరికలు లేకపోవడం వల్లనే ఇంతటి ముప్పు వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు..


డేనియల్ తుపాన్ బీభత్సం వల్ల డెర్నా ఇప్పుడు డిజాస్టర్ జోన్ గా మారిందని లిబియా ప్రధాని ఒసామా హమద్ అన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.

First Published:  13 Sep 2023 7:23 AM GMT
Next Story