Telugu Global
International

రాజీనామా చేస్తే ఏడాది జీతం ఫ్రీ..

సడన్ గా ఉద్యోగం పోతే ఎవరైనా ఏం చేస్తారు..? కంపెనీ నిబంధనల ప్రకారం వచ్చినంత తీసుకుని ఇంకో ఉద్యోగం వెదుక్కుంటారు. అయితే కొన్ని దేశాల్లో రూల్స్ బాగా కఠినంగా ఉంటాయి.

రాజీనామా చేస్తే ఏడాది జీతం ఫ్రీ..
X

'లేఆఫ్' ల వేళ ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనుకోవాల్సిందే. ఆఫీస్ కి అని బయలుదేరిన ఉద్యోగులకు సడన్ గా మిమ్మల్ని పనిలోనుంచి తీసేశాం అని మెయిల్స్ పంపించే ట్విట్టర్ వంటి సంస్థలతోపాటు.. బాబ్బాబు ఏడాది జీతం ఉచితంగా ఇస్తాం రాజీనామా చేయండి ప్లీజ్ అంటూ బతిమిలాడుకునే సంస్థలు కూడా ఉండటం నిజంగా విశేషమే. ఇలా ఏడాది జీతం ఉచితంగా ఇస్తామంటూ దిగ్గజ కంపెనీలు అమెజాన్, గూగుల్.. తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి.

2023 జనవరి నుంచి ఇప్పటి వరకు 1.6 లక్షల మంది ఉద్యోగుల్ని పలు సంస్థలు తొలగించాయి. ఒకరకంగా 2023ని లే ఆఫ్ నామ సంవత్సరంగా చెప్పుకోవాల్సిందే. సడన్ గా ఉద్యోగం పోతే ఎవరైనా ఏం చేస్తారు..? కంపెనీ నిబంధనల ప్రకారం వచ్చినంత తీసుకుని ఇంకో ఉద్యోగం వెదుక్కుంటారు. అయితే కొన్ని దేశాల్లో రూల్స్ బాగా కఠినంగా ఉంటాయి. ఉద్యోగంలోనుంచి తొలగించాలంటే కచ్చితంగా ఆ కంపెనీలోని ఉద్యోగుల కౌన్సిల్ ఒప్పుకోవాలనే రూల్స్ కూడా కొన్ని దేశాల్లో ఉన్నాయి. అలాంటి దేశాల్లోనే ఇలాంటి ఆఫర్లు తెరపైకి వచ్చాయి.

యూరోపియన్ దేశాల్లో ఉన్న కఠినమైన కార్మిక రక్షణ చట్టాల వల్ల అక్కడ లేఆఫ్ లు ప్రకటించడం కంపెనీలకు అంత ఈజీ కాదు. ఉద్యోగిని అకారణంగా, ఉద్యోగుల కౌన్సిల్ సమ్మతి లేకుండా తొలగించడం అసలు కుదరదు. దీంతో కంపెనీలు ఉద్యోగుల్ని బతిమిలాడుకునే పనిలో పడ్డాయి. ఫ్రాన్స్‌ లో ఉన్న తమ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కోరింది. దానికి ప్రతిఫలంగా ఏడాది జీతం ఇస్తానని ప్రకటించింది. ఐదు సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్న సీనియర్ మేనేజర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వారికి ఒక సంవత్సరం వేతనంతో కూడిన సెవెరెన్స్ ప్యాకేజీ ఇస్తామని చెప్పింది అమెజాన్ సంస్థ.

జర్మనీలో కూడా అమెజాన్ ఇలాంటి ప్యాకేజీలే ప్రకటించింది. ప్రొబేషన్ పీరియడ్‌ లో ఉన్నవారికి కూడా స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీలు ఇస్తోంది. డబ్లిన్, జ్యూరిచ్ లో కూడా గూగుల్ ఇలాంటి ఆఫర్లు ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు ఉద్యోగులను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.

First Published:  11 April 2023 12:29 PM GMT
Next Story