Telugu Global
International

నా కూతురి పేరు ఎవరూ పెట్టుకోవద్దు.. కిమ్ మరో నియంతృత్వ నిర్ణయం

డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్స్ లో కూడా జుయే అనే పేరు ఉండకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ధ్రువ పత్రాల్లో కూడా ప్రజలు పేరు మార్చుకుంటున్నారు.

నా కూతురి పేరు ఎవరూ పెట్టుకోవద్దు.. కిమ్ మరో నియంతృత్వ నిర్ణయం
X

ప్రపంచంలో నేటితరం నాయకుల్లో ఎవరైనా నియంత ఉన్నారా.. అని ప్రశ్న తలెత్తితే టక్కున గుర్తుకు వచ్చే పేరు కిమ్ జోంగ్ ఉన్. ఉత్తరకొరియా అధ్యక్షుడు అయిన ఈయనలో జాలి, దయాగుణం, మానవత్వం వంటి లక్షణాలు మచ్చుకైనా కనపడవు. కిమ్ తీసుకునే నియంతృత్వ నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు బానిస బతుకులు బతుకుతున్నారు. ఈ దేశంలో పుట్టడమే మేము చేసుకున్న పాపం..అని అన్ని కష్టాలు భరిస్తున్నారు. కాగా, తాజాగా కిమ్ తీసుకున్న మరో నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిమ్ తర్వాత ఆయన వారసుడు ఎవరూ అనే ప్రశ్న ఆ దేశ ప్రజల్లో ఉంది. అయితే ఇటీవల కాలంలో కిమ్ కుమార్తె జుయే ఆయన వారసురాలు అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మామూలుగా కిమ్ బాహ్య ప్రపంచంలో కనిపించడమే తక్కువ. ఇక కిమ్ కుటుంబ సభ్యులు అసలు కనిపించరు. అలాంటిది ఇటీవల కిమ్ తన పర్యటనలకు కుమార్తెను వెంటబెట్టుకుని వస్తున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక్క ఫొటో కూడా మీడియాకు విడుదల చేయని కిమ్ ఇప్పుడు కుమార్తెతో కలిసి ఫోజులు ఇస్తున్నాడు. కొద్దిరోజుల కిందట ఉత్తర కొరియాలో ఆర్మీ ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించగా కిమ్ తన కుమార్తెను మీడియాకు పరిచయం చేశాడు. ఈ నేపథ్యంలో కిమ్ తర్వాత జుయే తదుపరి దేశ అధ్యక్షురాలు అవుతుందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కిమ్ ప్రభుత్వం ఇటీవల దేశ ప్రజలకు ఒక నోటీసు జారీ చేసింది. దేశంలో ఎవరైనా తన కుమార్తె పేరు అయిన జుయే పేరును పెట్టుకుని ఉంటే వెంటనే మార్చుకోవాలని అందులోని సారాంశం. ఒక మహిళ, 12 ఏళ్ల బాలిక జుయే అని పేరు పెట్టుకోగా వెంటనే పేరు మార్చుకోవాలని వారికి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశంలో జుయే అని పేరు పెట్టుకున్న చాలామంది ప్రస్తుతం తమ పేరును మార్చుకునే పనిలో ఉన్నారు.

అలాగే డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్స్ లో కూడా జుయే అనే పేరు ఉండకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ధ్రువ పత్రాల్లో కూడా ప్రజలు పేరు మార్చుకుంటున్నారు. అయితే ఉత్తర కొరియాలో ప్రజలు పేర్లు మార్చుకోవాలని అధినేతలు ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి కాదు. కిమ్ సంగ్ పాలనలో అలాగే కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టిన తర్వాత తన పేరు, తన భార్య పేరు ఎవరైనా పెట్టుకుని ఉంటే మార్చుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కిమ్ తన కుమార్తె పేరు పెట్టుకున్న వారు తమ పేరును మార్చుకోవాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జుయేనే తదుపరి ఉత్తరకొరియా అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

First Published:  17 Feb 2023 10:57 AM GMT
Next Story