Telugu Global
International

నేలకు చేరిన గ్రహశకలం విశ్వం గుట్టు విప్పేనా..

ఒసిరిస్‌ రెక్స్‌ అంతరిక్ష నౌక భూమిపైకి దిగదు. భూమికి సుమారు లక్ష కిలోమీటర్ల ఎత్తులో నుంచే నమూనా క్యాప్సూల్‌ విడుదల చేసింది. సరిగ్గా ఈ సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు ఊటా ఎడారిలో పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యింది.

నేలకు చేరిన గ్రహశకలం విశ్వం గుట్టు విప్పేనా..
X

అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. విశ్వం ఆవిర్భావం, భూమి పుట్టకను తెలుసుకునేందుకు నాసా చేపట్టిన ఒసిరిస్‌ రెక్స్‌ మిషన్‌ విజయం సాధించింది. దాదాపుగా 7 ఏళ్ల తరువాత బెన్నూ అనే గ్రహశకల నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఆదివారం అమెరికా ఊటా రాష్ట్రంలో ఎడారిలో నాసా క్యాప్సూల్ దిగింది.




1999 సెప్టెంబర్ 11న తొలిసారిగా ఓ ఆస్టరాయిడ్‌ను గుర్తించింది నాసా. ఇది కార్బోనేషియస్ గ్రహశకలం. దీని విస్తీర్ణం 565 మీటర్లు. సెకెనుకు 28 కిలోమీటర్ల వేగంతో ఈ అస్టరాయిడ్ ప్రయాణం సాగుతోంది. దీని వేగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈజిప్ట్ మైథాలజీలో ఉన్న బెన్ను అనే పక్షి పేరును పెట్టారు. దీనిని పరిశీలిస్తే 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అనే దాని గురించి మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంటుందని నాసా భావిస్తోంది. గ్రహశకలం నమూనాలు తీసుకొచ్చేందుకు ఒసిరిస్‌ రెక్స్‌ (OSIRIS-రెక్స్) అనే మిషన్‌ను సెప్టెంబర్ 8, 2016న ప్రారంభించింది. ఇది డిసెంబర్ 2018లో బెన్నూను చేరుకుంది. రెండు సంవత్సరాల పాటు గ్రహశకలాన్ని మ్యాప్ చేసిన తర్వాత.. 2020లో బెన్నూ నుంచి రాళ్లు, ధూళిని సేకరించింది. ఆ తరువాత మే 10, 2021న.. భూమికి తిరుగు ప్రయాణం కాగా.. మిషన్‌లోని క్యాప్సూల్‌ ఆదివారం అమెరికాలో విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ విషయాన్ని నాసా ధ్రువీకరించింది.




నిజానికి ఒసిరిస్‌ రెక్స్‌ అంతరిక్ష నౌక భూమిపైకి దిగదు. భూమికి సుమారు లక్ష కిలోమీటర్ల ఎత్తులో నుంచే నమూనా క్యాప్సూల్‌ విడుదల చేసింది. సరిగ్గా ఈ సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు ఊటా ఎడారిలో పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యింది. అంతరిక్ష నౌక నమూనాను విడుదల చేసిన 20 నిమిషాల తర్వాత ఇంజిన్లను మండించుకుని.. ఒసిరిస్‌ రెక్స్‌ తిరిగి పయనమైంది. ఈ వ్యోమనౌక 2029లో మళ్లీ ఆస్టరాయిడ్ సమీపానికి చేరుకుంటుంది. ఈఫిల్ టవర్ కంటే ఎత్తు ఉన్న ఈ ఆస్టరాయిడ్ 300 ఏళ్ల తర్వాత భూమిని ఢీ కొట్టే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

First Published:  25 Sep 2023 7:28 AM GMT
Next Story