Telugu Global
International

ఈ విమానాలు శబ్దం చేయవు!.. నాసా కొత్త ప్రయోగం

ఎక్స్‌-59 పేరుతో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంగా దూసుకెళ్లే విమానాలను నాసా రూపొందిస్తోంది. ఈ కొత్తరకం విమానాలు అత్యధిక వేగంతో ప్రయాణించడమే కాకుండా శబ్దం చేయకుండా సైలెంట్‌గా ఆకాశంలో దూసుకెళ్తాయి.

ఈ విమానాలు శబ్దం చేయవు!.. నాసా కొత్త ప్రయోగం
X

ఆకాశంలో విమానం వెళ్తుంటే ఆ శబ్దం వంటింట్లోకి వినిపిస్తుంది. విమానం ఇంకా వేగంగా వెళ్తుంటే ఆ శబ్దం ఇంకా ఎక్కువవుతుంది. అయితే ఈ సమస్యను తగ్గించడానికి కొత్తరకం సూపర్ సోనిక్ విమానాలను తయారు చేస్తోంది నాసా. వీటి ప్రత్యేకతలేంటంటే..

ఎక్స్‌-59 పేరుతో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంగా దూసుకెళ్లే విమానాలను నాసా రూపొందిస్తోంది. ఈ కొత్తరకం విమానాలు అత్యధిక వేగంతో ప్రయాణించడమే కాకుండా శబ్దం చేయకుండా సైలెంట్‌గా ఆకాశంలో దూసుకెళ్తాయి. ధ్వ‌ని వేగంతో ప్రయాణించే విమానాలు గతంలో కూడా ఉన్నాయి. వాటిని 'కంకార్డ్‌' విమానాలు అని పిలిచేవారు. అయితే అత్యధిక శబ్దాన్ని చేసే ఆ విమానాల రాకపోకల వల్ల ఎంతో ఇబ్బంది నెలకొనడంతో 2003లో ఈ విమాన సర్వీసుకు ముగింపు పలకాల్సి వచ్చింది. నగరాలకు సమీపంలో సూపర్ సోనిక్‌ వేగంతో నడిచే విమానాలను అనుమతించకూడదని అంతర్జాతీయ నిబంధనలు కూడా తీసుకొచ్చారు. అయితే రోజురోజుగా పెరుగుతున్న విమాన ప్రయాణాల వల్ల వేగంగా ప్రయాణించే విమానాల అవసరం మరింత పెరిగింది. అందుకే శబ్దం చేయని సూపర్ సోనిక్ విమానాలను తయారు చేసే పనిలో పడింది నాసా.

ధ్వ‌ని వేగం కంటే ఎక్కువ‌ వేగంగా ప్రయాణించే విమానాలను 'ఎక్స్‌-59' పేరుతో డిజైన్‌ చేస్తున్నారు. ఈ ఎక్స్‌-59లో డిజైన్ చేసిన ఏరోడైనమిక్స్.. శబ్ద తరంగాలను అన్ని దిశలకూ వెదజల్లేలా చేసి శబ్దాన్ని తగ్గిస్తాయి. ఈ విమానాలు 75 డెసిబుల్స్‌ సౌండ్‌ను క్రియేట్ చేస్తాయి. ఈ విమానం ఆకాశంలో వెళ్తున్నప్పుడు.. నేల మీదున్నవారికి, ఎక్కడో దూరంగా ఒక చిన్నపాటి ఉరుము లాంటి ధ్వని మాత్రమే వినిపిస్తుంది. లేదా అసలు శబ్దమే వినపడకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆ తరంగాలు చాలా చిన్నగా ఉండటంతోపాటు అన్ని వైపులకూ వ్యాప్తి చెందడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.


ఎక్స్‌-59 సూపర్ సోనిక్ విమానం 55వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. దీని వేగం గంటకు 1,488 కిలోమీటర్లు ఉంటుంది. దీని బరువు 11 టన్నులు, ఎత్తు 14 అడుగులు, పొడవు 99 అడుగులు, వెడల్పు 29 అడుగులు ఉంటుంది. ప్రస్తుతం ఎక్స్‌-59ను నేలపై పరీక్షిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో దీన్ని తొలిసారి గగనవిహారం చేయించే అవకాశం ఉంది.

First Published:  4 Sep 2022 5:30 AM GMT
Next Story