Telugu Global
International

అది భారత్‌కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ శకలమే

భారత పీఎస్ఎల్వీ నుంచి వచ్చిన శిథిలంగా ప్రకటించింది. PSLV నాలుగు దశలను కలిగి ఉంటుంది. ఇది మూడో దశ నుంచి విడవడిన శకలం అయ్యుంటుందని నిర్ధారణకు వచ్చామని చెప్పింది.

అది భారత్‌కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ శకలమే
X

కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో కనిపించి ఆశ్చర్యపరిచిన వింత వస్తువు గురించి ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ వివరాలు ప్రకటించింది. అది భారతదేశం ప్రయోగించిన పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికిల్ (PSLV)కి సంబంధించిందని తేల్చింది. దానిని ప్రస్తుతానికి భద్రపరిచి తదుపరి కార్యక్రమం కోసం ఇస్రోతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ప్రపంచ దేశాల మధ్య అంతరిక్ష ప్రయోగాల్లో తన ఉనికిని నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. చంద్రయాన్ వంటి ప్రయోగాలు, పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా పలు శాటిలైట్లను కక్ష్యల్లోకి చేర్చటం వంటి కార్యక్రమాలలో ముందుంటోంది. ఆ క్రమంలో భాగంగా గతంలో ప్రయోగించిన ఓ పీఎస్ఎల్వీ రాకెట్ శకలం ఇటీవల ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు ఇదేదో వింత వస్తువు అని భావించారు. అయితే, ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ఇది భారత రాకెట్ శకలం అని తాజాగా నిర్ధారించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.



కొద్ది రోజుల క్రితం పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో ఉన్న జురియన్ బే బీచ్‌కు కొట్టుకు వచ్చిన ఓ పెద్ద వస్తువు పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ వింత వస్తువు చంద్రయాన్-3ని తీసుకెళ్లిన ఎల్వీఎం రాకెట్‌కు సంబంధించిన శకలమని చాలా మంది భావించారు. అప్పటికే చంద్రయాన్-3 తన ప్రయాణం మొదలుపెట్టి రెండు రోజులే అవ్వటం, అది ఆస్ట్రేలియా గగనతలం మీద నుంచి వెళ్లింది అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వటంతో అందరూ ఇది చంద్రయాన్ కు సంబంధం ఉన్న వస్తువు గా భావించారు. ఈ వింత వస్తువు 2.5 మీటర్ల పొడ‌వు, 2.5-3 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.

అయితే పూర్తి వివరాలు తెలియకపోవడంతో పర్యాటకులు దానికి దూరంగా ఉండాలని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ కోరింది. ఈ విషయంపై దర్యాప్తున‌కు ముందే అది విదేశీ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వస్తువై ఉంటుందని ప్రాథ‌మిక అంచనాకు వచ్చింది. ఆ వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది.

తాజాగా మరో సమాచారం విడుదల చేసింది. అది భారత పీఎస్ఎల్వీ నుంచి వచ్చిన శిథిలంగా ప్రకటించింది. PSLV నాలుగు దశలను కలిగి ఉంటుంది. ఇది మూడో దశ నుంచి విడవడిన శకలం అయ్యుంటుందని నిర్ధారణకు వచ్చామని చెప్పింది. దీనిపై ఇస్రోతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఐక్యరాజ్యసమితి అంతరిక్ష నిబంధనలను అనుసరించి ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రోతో కలిసి పనిచేసి దీనిని ఏంచేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామంది.

ప్రస్తుతానికి అయితే ఈ వస్తువులు జాగ్రత్తగా భద్రపరిచామని చెప్పింది. ఒకవేళ ఎవరైనా ఇటువంటి అనుమానాస్పద శిథిలాలను గుర్తించినట్లయితే వెంటనే స్థానిక అధికారులకు తెలియజేయాలని కోరింది.

First Published:  31 July 2023 1:56 PM GMT
Next Story