Telugu Global
International

నా ప‌నినే గొప్ప‌గా భావించా.. అదే న‌న్ను సీఈవోని చేసింది.. - మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌

మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల తాజా ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నారు. ప్ర‌పంచంలోనే మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు తాను నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని తెలిపారు.

నా ప‌నినే గొప్ప‌గా భావించా.. అదే న‌న్ను సీఈవోని చేసింది..    - మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌
X

చేసే ప‌నినే గొప్ప‌గా భావించాన‌ని, అదే త‌న‌ను సీఈవోని చేసిందని మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల తెలిపారు. తాజాగా లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్ స్కీ ఆయ‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌గా, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నారు. ప్ర‌పంచంలోనే మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు తాను నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని స‌త్య నాదెళ్ల ఈ సంద‌ర్భంగా తెలిపారు.

1992లో 22 ఏళ్ల వ‌య‌సులో తాను మైక్రోసాఫ్ట్‌లో యువ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా అడుగుపెట్టాన‌ని, ఉద్యోగంలోకి చేరాక ఈ ప్ర‌పంచంలోనే గొప్ప ఉద్యోగం చేస్తున్నాన‌ని తాను భావించేవాడిన‌ని ఆయ‌న వివ‌రించారు. మ‌రో చోటికి వెళ్లి ఉద్యోగం చేయాల‌నే ఆలోచ‌న కూడా ఎప్పుడూ ఉండేది కాద‌ని తెలిపారు. మొత్తం 30 ఏళ్ల మైక్రోసాఫ్ట్ కెరీర్‌లో తాను ఏనాడూ త‌న ఉద్యోగం గురించి ఆలోచించిన సంద‌ర్భం లేద‌ని స‌త్య నాదెళ్ల‌ చెప్పారు. తాను చేస్తున్న ప‌ని చాలా ముఖ్య‌మైన‌దిగా మాత్ర‌మే భావించేవాడిన‌ని వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న యువ‌త‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. `చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుద‌ల లేద‌ని.. మ‌రో కంపెనీలో చేర‌దామ‌నే ఆలోచ‌న‌తో కాకుండా.. ప్ర‌స్తుత ఉద్యోగంలో మీ పాత్ర‌ను విజ‌య‌వంతంగా పోషించండి.. మైక్రోసాఫ్ట్‌లో నేను నేర్చుకున్న పాఠం ఇదే..` అని ఆయ‌న చెప్పారు. బాగా ప‌నిచేసేందుకు ఇంకో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్ద‌ని స‌త్య నాదెళ్ల ఈ సంద‌ర్భంగా సూచించారు. ప్ర‌స్తుత ఉద్యోగం మీకు నేర్చుకోవ‌డానికి వ‌చ్చిన ఒక అవ‌కాశంగా భావించి.. విజ‌య‌వంతంగా మీ పాత్ర‌ను పోషించాల‌ని తెలిపారు. త‌ద్వారా అనుకున్న ల‌క్ష్యాల‌ను అంటే.. ప్ర‌మోష‌న్లు, ఇంక్రిమెంట్లు వేగంగా పొంద‌గ‌లుగుతార‌ని వివ‌రించారు. చేస్తున్న ప‌నిపై నిరాశ‌తో ఉంటే.. ఎప్ప‌టికీ ఎద‌గ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు.

First Published:  26 March 2023 2:22 AM GMT
Next Story