Telugu Global
International

తైవాన్‌లో భారీ భూకంపం, పలు దేశాలకు సునామీ హెచ్చరికలు

తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదైంది.

తైవాన్‌లో భారీ భూకంపం, పలు దేశాలకు సునామీ హెచ్చరికలు
X

భారీ భూకంపం తైవాన్‌ సహా జపాన్‌ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. వందలాది భవనాలు కుప్పకూలాయి. తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదైంది. తైవాన్ లోని హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని యునైటేడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలను కూడ అధికారులు జారీ చేశారు

భూకంప తీవ్రతను తైవాన్ పర్యవేక్షణ ఏజెన్సీ 7.2 తీవ్రతను నమోదు చేయగా, అమెరికా జియోలాజికల్ సర్వే 7.4గా పేర్కొంది. మియాకోజిమా ద్వీపంతో పాటు జపాన్ లోని దీవుల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఒకినావాకు సునామీ హెచ్చరిక ఉండటంతో విమానాలు రద్దు చేయబడ్డాయి. ఫిలిప్పీన్స్ కూడా సునామీని హెచ్చరించింది. తీర ప్రాంతాలను ఖాళీ చేయమని ఆదేశించింది. భూకంపం తర్వాత 3 మీటర్ల (9.8 అడుగులు) వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు అరగంట తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు తెలిపింది.



భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక ఐదంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయిన చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. స్పీడ్ రైలు సర్వీసును నిలిపివేశారు. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయి. జపాన్‌లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

తైవాన్‌లో 25 ఏళ్లలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీనిని చెబుతున్నారు. 1999లో తైవాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2,400 మంది మరణించారు.

First Published:  3 April 2024 5:05 AM GMT
Next Story