Telugu Global
International

ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచండి.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం..

మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫామ్‌లు, ఫిరంగి షెల్‌లను, వ్యూహాత్మక క్షిపణులు, సాయుధ వాహనాలు, ఉత్పత్తి చేసే కర్మాగారాలను కిమ్‌ ఉన్నతాధికారుల బృందంతో కలిసి సందర్శించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచండి.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం..
X

యుద్ధానికి సిద్ధంకావాలంటూ సైనిక బలగాలను ఇప్పటికే ఆదేశించిన ఉత్తర కొరియా నియంత కిమ్‌ పనిలోపనిగా మరోసారి ఆయుధ స్థావరాలను సందర్శించారు. వచ్చే వారం దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన బలగాలను కిమ్ మరోసారి ఆదేశించారు.

క్షిపణులు సహా మిగిలిన ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని సూచించారు. మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫామ్‌లు, ఫిరంగి షెల్‌లను, వ్యూహాత్మక క్షిపణులు, సాయుధ వాహనాలు, ఉత్పత్తి చేసే కర్మాగారాలను కిమ్‌ ఉన్నతాధికారుల బృందంతో కలిసి సందర్శించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఫ్రంట్ లైన్ మిలిటరీ యూనిట్ల అవసరాలకు అనుగుణంగా క్షిపణులను భారీగా ఉత్పత్తి చేయాలని కూడా ఉత్తర కొరియా అధినేత స్పష్టం చేసినట్టుగా సమాచారం.

మరోవైపు తుపాను ధాటికి అతలాకుతలమైన పలు ప్రాంతాలను కిమ్‌ పరిశీలించారు. వరదల హెచ్చరికలు ఉన్నప్పటికీ సరైన విధంగా సిద్ధంకాలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కిమ్‌ అందుతున్న సహాయ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి కీలక సూచనలు చేశారు. వరదల వల్ల దాదాపు 200 హెక్టార్ల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయని ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ వరదలు అసలు ఎప్పుడు సంభవించాయి అనే విషయంపై ఎలాంటి వివరాలు లేవు.. అయితే కిమ్‌ మాత్రం శుక్ర, శని వారాల్లో పర్యటించినట్టు సమాచారం. రైతులకు మార్గదర్శకత్వం చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంతటి నష్టం వాటిల్లిందని ఆ ఏజెన్సీ తెలిపింది.

First Published:  14 Aug 2023 10:55 AM GMT
Next Story