Telugu Global
International

జపాన్ లో భారీ భూకంపం… రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత

సముద్రంలో భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రం వద్దకు వెళ్లొద్దని సూచించారు.

జపాన్ లో భారీ భూకంపం… రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత
X

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఫసిఫిక్‌ మహాసముద్రం వెలుపలి దీవుల సమీపంలో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈస్ట్‌ కోస్ట్‌ ఏరియాలోని ఇజు ఐస్‌ల్యాండ్స్‌లో సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదైంది. మరోవైపు సముద్రంలో భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రం వద్దకు వెళ్లొద్దని సూచించారు.



తోరిషిమా సమీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన నేప‌థ్యంలో జపాన్ ఇజు దీవులకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఒక మీటరు ఎత్తుకు సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇజు దీవుల్లోని తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒక మీటర్‌ (3.2 అడుగులు) ఎత్తులో సునామీ తీరాలను తాకవచ్చని జపాన్‌ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే హచిజో ద్వీపంలోని యానే సమీపంలో 30 సెం.మీ (ఒక అడుగు) పరిమాణంలో చిన్న సునామీ వచ్చినట్లు స్థానిక ఏజెన్సీ తెలిపింది. అయినప్పటికీ ఎటువంటి నష్టం జరగలేదని, దీంతో రెండు గంటల తర్వాత సునామీ హెచ్చరికలను ఎత్తివేసినట్లు వెల్లడించింది.



ఫసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండే జపాన్ కు భూకంపాల ముప్పు ఎక్కువ. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం వల్ల తరచుగా భూకంపాలు వస్తుంటాయి. అందుకే ఇక్కడి ఇళ్లను భూకంపాలను తట్టుకునే విధంగా కలప, తేలికపాటి పదార్థాలతో నిర్మిస్తుంటారు. అలాగే భూకంపాలను గుర్తించేందుకు జపాన్ అత్యంత ఆధునిక టెక్నాలజీని వాడుతోంది.

First Published:  5 Oct 2023 11:26 AM GMT
Next Story