Telugu Global
International

ఇటలీలో తీవ్ర కరువు... ఎండిపోతున్న నదులు, సరస్సులు

ఇటలీలో కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో అక్కడ దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 'పో' వంటి అతిపెద్ద నది, 'గార్డా' వంటి అతి పెద్ద సరస్సు కూడా ఎండిపోయాయి.

ఇటలీలో తీవ్ర కరువు... ఎండిపోతున్న నదులు, సరస్సులు
X

ఇటలీ కరువుతో అల్లాడిపోతోంది. అనేక నదులు, సరస్సులు ఎండి పోతున్నాయి. కొన్ని నెలలుగా వర్షాలు లేక ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ పరిస్థితులు దాపురించాయని అధికారులు చెప్తున్నారు. దీంతో నదులు, సరుస్సుల చుట్టూ వ్యవ‌సాయ భూములు కూడా బీళ్ళుగామారిపోతున్నాయి. దేశంలోనే అతి పెద్ద సరస్సు అయిన గార్డా సరస్సులో నీళ్ళు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. సరస్సులో నీళ్ళు లేక బండలు బైటికి తేలాయి.

ఈ సరస్సు దగ్గరికి ప్రతి సమ్మర్ లో పర్యాటకులు ఎక్కువగా వస్తూంటారు. అయితే ఈ సారి ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఇక్కడి పరిస్థితి చూసి షాక్ కు గురవుతున్నారు. ఎప్పుడూ కూడా ఇలా సరస్సు ఎండి పోయిన స్థితిలో చూడలేదని పర్యాటకులు చెప్తున్నారు. "కొంచెం బాధగా ఉంది. ఇంతకు ముందు ఇక్కడ కెరటాలు ఎగసిపడే శబ్ధం వినబడేది. ఇప్పుడు ఏమీ వినడం లేదు" అని ఓ పర్యాటకుడు అన్నాడు.

ఇటలీలోని ముఖ్యమైన నదులలో ఒకటైన పో నది కూడా ఈ సారి ఎండి పోయింది. ఈ న‌ది అత్యంత పొడువైన‌ది. తూర్పు దిశ‌గా సుమారు 650 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌వ‌హిస్తుంది. న‌దిలోకి ఉప్పు నీరు ప్ర‌వ‌హిస్తోంద‌ని, దీంతో పో న‌ది ప‌రివాహాక ప్రాంతంలో ఉన్న పంటలు నాశ‌నం అవుతున్న‌ట్లు రైతులు వాపోతున్నారు.

పో నది చుట్టూ సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నాలుగు నెలలుగా చుక్క వాన కూడా కురవకపోవడం వల్ల దేశంలో ఆహార ఉత్పత్తి తగ్గిపోయింది. 40 శాతం ఆహారోత్పత్తులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో 50 శాతం పశువులు నీళ్ళు లేక‌ అల్లాడుతున్నాయి.

ఇటలీలోని మరో ప్రసిద్ధ నగరమైన రోమ్‌లోని టైబర్ నదిలో కూడా నీటి మట్టం తగ్గింది. మగ్గియోర్‌లలో కూడా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలోని జలవిద్యుత్ ఉత్పత్తికి నీటి కొరత కూడా ఒక సమస్యగా మారింది. ఫలితంగా జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.

ఉత్తర ఇటలీ ప్రాంతంలో నెలల తరబడి వర్షాలు లేవు. ఈ సంవత్సరం హిమపాతం 70% తగ్గింది, ఇటలీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నీరు సరఫరా చేసే 'పో' వంటి ముఖ్యమైన నదులు ఎండిపోయాయి. స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బ్రిటన్‌తో సహా అనేక ఐరోపా దేశాలు ఈ వేసవిలో కరువులను చవిచూస్తున్నాయి, ఇవి వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అంతే కాదు నౌకా రవాణాను కూడా దెబ్బ తీశాయి. నీటి వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు వచ్చాయి.

గార్డా మేయర్ డేవిడ్ బెడినెల్లి మాట్లాడుతూ రైతులను, పర్యాటక పరిశ్రమను కాపాడటానికి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. జులై చివరిలో ఇటలీలో తాజా హీట్ వేవ్ సమయంలో, ఎక్కువగా జర్మన్ పర్యాటకులు తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ వేసవి పర్యాటక సీజన్ ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉందని అతను చెప్పాడు.

"ఈ సంవత్సరం మనం తీవ్రమైన కరువు ఎదుర్కుంటున్నది నిజమే అయినా పర్యాటకులు బాగానే వస్తున్నారు." అని బెండినెల్లి జూలై 20 ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు.

గార్డా సరస్సు రోజుకు రెండు సెంటీమీటర్ల (0.78 అంగుళాలు) నీటిని కోల్పోతోందని అతను ధృవీకరించారు.

seatemperature.org ప్రకారం, సరస్సు యొక్క ఉష్ణోగ్రత, ఆగస్టులో సగటు కంటే ఎక్కువగా ఉంది. శుక్రవారం, గార్డా యొక్క నీరు దాదాపు 26 డిగ్రీల సెల్సియస్ (78 డిగ్రీల ఫారెన్‌హీట్)గా ఉంది.

ఇటలీలోనే కాక మొత్తం యూరప్ లో ఈ సారి కరువు విలయతాండ్వం చేస్తోంది. గత 500 ఏళ్ళలో ఇటువంటి కరువు పరిస్థితులు ఎప్పుడూ లేవని అధికారులు చెప్తున్నారు.

First Published:  14 Aug 2022 5:50 AM GMT
Next Story