Telugu Global
International

మిన్నంటిన నిరసనలు...హిజబ్ లు కాల్చేస్తున్నారు, జుత్తును కత్తిరించుకుంటున్నారు

షరియా చట్టం పేరుతో ఇరాన్ ప్రభుత్వం మహిళలపై అనుసరిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఇరానీ మహిళ తిరుగబడింది. హిజబ్ సరిగ్గా ధరించనందుకు పోలీసులు అరెస్టు చేసిన ఓ యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో ఇరాన్ ఒక్క సారి భగ్గుమంది.

మిన్నంటిన నిరసనలు...హిజబ్ లు కాల్చేస్తున్నారు, జుత్తును కత్తిరించుకుంటున్నారు
X

ఇరాన్ లో ఇటీవల ఓ మహిళ పోలీసు కస్టడీలో మరణించడంతో అక్కడి మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్ సరిగ్గా ధరించలేదని మహ్సా అమిని అనే 22 ఏళ్ళ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పోలీసు కస్టడీలోనే మరణించింది. దాంతో షరియా చట్టం పేరుతో ఏళ్ళ తరబడి అణిచివేయబడుతున్న ఇరానీ మహిళలు ఒక్క సారి రోడ్డెక్కారు. హిజాబ్ లను కాల్చి వేస్తూ, జుట్టును కత్తిరించుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ష్రియా చట్టాన్ని కఠినంగా అమలు చేయడం కోసం ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ ఏడాది జూలైలో 'మొరాలిటీ పోలీస్ ' అనే కొత్త దళాన్ని ఏర్పాటు చేశాడు.

22 ఏళ్ల మహ్సా అమినీ తన కుటుంబంతో కలిసి టెహ్రాన్ సందర్శనలో ఉండగా, ఈ 'మొరాలిటీ పోలీస్' యూనిట్ ఆమెను అదుపులోకి తీసుకుంది. కొద్దిసేపటికి ఆమెకు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెకు గతంలో ఎప్పుడూ గుండెకు సంబంధించిన వ్యాధులు లేవని, పోలీసుల చిత్ర హింసలవల్లే ఆమె చనిపోయిందని అమినీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అమినీ మరణంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో సహా అనేక నగరాల్లో మహిళలు రోడ్డెక్కుతున్నారు. సోషల్ మీడియాలో నిరసనలు తెలుపుతున్నారు. అనేక చోట్ల నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. టియర్ గ్యాస్ వదులుతున్నారు. నిన్న సఘేజ్ నగరంలో నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి అని ఇరాన్ జర్నలిస్ట్,ఆక్టివిస్టు మాసిహ్ అలినేజాద్ ట్విట్టర్ లో తెలిపారు. ''పోలీసులు మహ్సా అమినీని చంపినందుకు నిరసనగా ఇరానియన్ మహిళలు జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్ ల‌ను కాల్చేస్తూ తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. " అని ఆమె ట్వీట్ చేశారు.

"మేము 7 సంవత్సరాల వయస్సు నుండి మా జుట్టును పూర్తిగా కప్పుకోకపోతే మేము పాఠశాలకు వెళ్లలేము, ఉద్యోగం పొందలేము. ఈ లింగ, వర్ణవివక్ష పాలనతో మేము విసిగిపోయాము" అని ఆమె ట్వీట్ లో పేర్కొంది. విద్యార్థులు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొన్నారని, ఇరాన్ మొత్తం ఆగ్రహంగా ఉందని ఆమె తెలిపింది. భద్రతా బలగాలు నిరసనకారులపై కాల్పులు జరిపి వారిలో కొందరిని గాయపరిచారని, అయినా చాలా మంది ధైర్యంగా రెండవ రోజు కూడా వీధుల్లోకి దూసుకెళ్లి "భయపడకండి, మనమందరం ఐక్యంగా ఉన్నాము" అని నినదించారని ఆమె చెప్పారు.


"22 ఏళ్ల యువతి మహ్సా అమిని కస్టడీలో అనుమానాస్పద మృతికి దారితీసిన పరిస్థితులపై, కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలపై, అధికార‌ దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేయాలి." అని మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది.

అమిని కస్టడీ మరణం పై ఇరాన్ లో తీవ్ర ఆగ్రహం రేకెత్తించిన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ కేసుపై విచారణకు ఆదేశించారు. ఈ కేసును తాము పార్లమెంటులో లేవనెత్తుతామని పలువురు చట్టసభ సభ్యులు చెప్పగా, విచారణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని న్యాయ శాఖ ప్రకటించిందని అల్ జజీరా నివేదించింది.

కాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విధానాల పట్ల, మోరల్ పోలీసు ద‌ళాల పట్ల ఇరాన్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరానియన్ ముస్లింలకు మాత్రమే కాకుండా అన్ని జాతులు, మతాలకు చెందిన మహిళలు తప్పనిసరి తలపై కండువాతో జుట్టు, మెడను దాచుకోవాలనే డ్రెస్ కోడ్ విధించడం, ఆ నిబంధన ఎవరైనా ధిక్కరించినా, పొరపాటున హిజాబ్ జారిపోయినా జరిమానాలే కాక మహిళలను అరెస్టులు చేసి శిక్షలు కూడా వేయడం పట్ల ఇరాన్ మహిళలు ఆగ్రహంగా ఉన్నారు. అమిని మరణం తర్వాత ఆ ఆగ్రహమంతా నిరసనల రూపంలో బైటికి వచ్చింది.

Next Story