Telugu Global
International

ఇజ్రాయెల్‌పై 200 డ్రోన్లతో ఇరాన్ దాడి

ఇరాన్‌పై ప్రత్యక్ష దాడికి దిగేందుకు తాము వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.

ఇజ్రాయెల్‌పై 200 డ్రోన్లతో ఇరాన్ దాడి
X

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఊహించినట్లుగానే ఇజ్రాయెల్‌పై 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి దాడి ప్రారంభించింది ఇరాన్. ఇరాన్‌ మిత్రదేశాలు సైతం ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేశాయి. అయితే ఈ డ్రోన్లు, మిస్సైల్స్ టార్గెట్‌ను చేరుకోవడానికి గంటల టైం తీసుకుంటాయని ఇజ్రాయెల్‌ సైన్యం స్పష్టం చేసింది.

ఇటీవల సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన పలువురు కీలక అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడికి ఇజ్రాయెల్‌ కారణమని ఇరాన్ భావిస్తోంది. ఇజ్రాయెల్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ హుస్సెన్ అలీ ఖమేని. ఇందులో భాగంగానే డ్రోన్లతో శనివారం రాత్రి దాడి చేసినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్‌పై ప్రత్యక్ష దాడికి దిగేందుకు తాము వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్స్‌ కూల్చివేసేందుకు అమెరికా సైన్యం ఇజ్రాయెల్‌కు సహాయ పడుతుందని చెప్పారు.

దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌, హమాస్ సేనల మధ్య దాదాపు 7 నెలలుగా యుద్ధం జరుగుతోంది. ఈ ఉద్రిక్తతలు లెబనాన్, సిరియా సరిహద్దుల వరకు వ్యాపించాయి. ఈ ఘర్షణలు ఇప్పుడు మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని.. అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌, దాని మిత్రపక్షాలు వర్సెస్‌ ఇజ్రాయిల్‌, దాని మద్దతుదారు అమెరికా మధ్య ఈ ఘర్షణలు ప్రత్యక్ష యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

రెండు రోజుల క్రితమే భారతీయులను కేంద్రం అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌, ఇజ్రాయెల్‌లకు ప్రయాణాలు విరమించుకోవాలని సూచించింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌లో ఇప్పటికే ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. సహాయం కోసం ఆయా దేశాల్లోని భారతీయ కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించింది.

First Published:  14 April 2024 5:19 AM GMT
Next Story