Telugu Global
International

ఇరాన్: పోలీసు కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 185 మంది మృతి!

ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న ఉద్యమంలో....పోలీసు కాల్పుల వల్ల ఇప్పటి వర‌కు 185 మంది మృతి చెందగా అందులో 19 మంది చిన్నారులున్నారు. ఆదివారంనాడు ఇరాన్ లో మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.

ఇరాన్: పోలీసు కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 185 మంది మృతి!
X

ఆదివారంనాడు పాఠశాల విద్యార్థినులు రోడ్లెక్కారు, కార్మికులు సమ్మె చేశారు. ఇరాన్ అంతటా వీధి ఘర్షణలు చెలరేగాయి, మహ్సా అమిని మరణంపై జరుగుతున్న నిరసనల మీద ప్రభుత్వ అనుసరిస్తున్న‌ రక్తపాత అణిచివేతను ధిక్కరిస్తూ ఉద్యమం నాల్గవ వారంలోకి ప్రవేశించింది.

దాదాపు 22 రోజులకు పైగా ఇరాన్ అగ్గిలా మండుతోంది. హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకొని వేలాదిమంది ప్రతిరోజూ రోడ్ల మీదికి వస్తున్నారు. ఉద్యమకారుల్లో అత్యధిక భాగం మహిళలే. పోలీసులు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. అరెస్టులు, కేసులు, జైళ్ళూ, లాఠీ చార్జ్ లు, టియర్ గ్యాస్ లు, తుపాకీ కాల్పులు, మరణాలు...అయినా వెన‌క్కి తగ్గనిమహిళా లోకం తిరగబడుతూనే ఉంది.

హిజాబ్ సరిగ్గా ధరించనందుకు మహ్సా అమినీ అనే 22 ఏళ్ల యువతి అరెస్టు, పోలీసు హింసలకు మరణం, అనంతరపరిణామాలు ఇరాన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. తరాలుగా అనుభవిస్తున్న అణిచివేత, వివక్ష అక్కడి మహిళలను రోడ్డెక్కేలా చేశాయి. దేశ వ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమంలో పోలీసు కాల్పుల వల్ల 185 మంది మరణించగా అందులో 19 మంది చిన్నారులున్నారు. ఇవిప్రభుత్వలెక్కలు మాత్ర‌మే నిజానికి అంత కన్నా ఎక్కువే మరణాలుంటాయని హక్కుల సంఘాలు చెప్తున్నాయి.

" దేశవ్యాప్త నిరసనలలో కనీసం 19 మంది పిల్లలతో సహా కనీసం 185 మంది మరణించారు. అత్యధిక సంఖ్యలో హత్యలు సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో నమోదయ్యాయి. నిజానికి జరిగిన హత్యల సంఖ్యలో సగం మాత్రమే నమోదయ్యాయి, "అని నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోలు చెప్తున్న దాని ప్రకారం...ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని డజన్ల కొద్దీ నగరాల్లో నిరసనలు కొనసాగాయి. భద్రతా దళాలు టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, కాల్పులు జరిపినప్పటికీ వందలాది మంది హైస్కూల్ బాలికలు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రోడ్లమీద నిరసన తెలుపుతున్నారు.

ట్విట్టర్ లో ప్రజలు ఎక్కువగా ఫాలో అయ్యే తస్విర్ అనే కార్యకర్త తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో... డజను మంది పోలీసులు ఓ మహిళ చుట్టూ చేరి ఆమెను కొడుతుండగా ఓ వ్యక్తి ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను... "నా భార్యను కొట్టవద్దు, ఆమె గర్భవతి" అని అరవడం ఆవీడియోలో కనిపించింది.

ట్విట్టర్ లో1,50,000 కంటే ఎక్కువ మంది ఫాలోయర్స్ ను కలిగి ఉన్నమామ్లేకేట్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో... బందర్ అబ్బాస్ నగరంలో భద్రతా దళాలు డజన్ల కొద్దీ పాఠశాల బాలికలను వెంబడిస్తూ కొడుతున్నట్టు చూపించాయి.

ఆదివారం నాడు సామూహిక సమ్మెకు కార్యకర్తలు పిలుపునిచ్చిన తర్వాత అనేక నగరాల్లో దుకాణాలు మూసివేయబడ్డాయని నెటిజనులు సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు షేర్ చేశారు.

ఇరాన్ అధికారులు ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల కారణంగా ప్రాణనష్టం వివరాలు పూర్తిగా తెలియడం లేదు.

మరో వైపు ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ ఉద్యమకారులను కించపర్చే ఇరాన్ ప్రభుత్వ టీవీని కొందరు ఉద్యమకారులు హ్యాక్ చేశారు. టీవీలో "స్త్రీ, జీవితం, స్వేచ్ఛ", అనే పదాలను ప్రదర్శించారు. దేసంలో జరుగుతున్న ఉద్యమాలను పోస్ట్ చేసిన కొన్ని ట్విట్టర్ అకౌంట్లను తెరపై చూపించారు. అయితే కొద్ది సేపట్లోనే ప్రభుత్వం తిరిగి టీవీని తన అధీనంలోకి తెచ్చుకుంది.

First Published:  10 Oct 2022 2:30 AM GMT
Next Story