Telugu Global
International

ఇక్కడ చావు ఎప్పుడొస్తుందో తెలియదు....అయినా ఇక్కడే ఉంటాం...!

ఉక్రెయిన్ కు తిరిగి వెళ్ళిన భారతీయ విద్యార్థులు తిరిగి భారత్ కు వెళ్ళిపోవాలని ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి రావడానికి సిద్దంగా లేరు.

ఇక్కడ చావు ఎప్పుడొస్తుందో తెలియదు....అయినా ఇక్కడే ఉంటాం...!
X

ఉక్రెయిన్ , రష్యా యుద్దం మొదలైన తర్వాత ఫిబ్రవరిలో ఉక్రెయిన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సుమారు 1,500 మంది వైద్య విద్యార్థులు మళ్ళీ ఉక్రెయిన్ కు తిరిగి వెళ్ళారు. ఉక్రెయిన్‌లోని వివిధ వైద్య కళాశాలల్లో చదువుతున్న ఈ విద్యార్థులు, తమ చదువు పూర్తి చేయడానికి భారత్ లో అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ను భారత ప్రభుత్వం తిరస్కరించడంతో తమ చదువులను కొనసాగించేందుకు తిరిగి ఉక్రెయిన్ వెళ్ళారు.

అయితే పెరుగుతున్న యుద్దం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.అయినప్పటికీ విద్యార్థులు ససేమిరా అంటున్నారు.

భారతదేశానికి వచ్చిన తర్వాత, ఈ వైద్య విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ (NMCA), 2019 ప్రకారం ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు భారతీయ విశ్వవిద్యాలయాలలో చదువును కొనసాగించే అవకాశం కల్పించలేమని సెప్టెంబర్‌లో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇలాంటి సడలింపులు ఇవ్వడం వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. దాంతో 1500 మంది భారతీయ విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్ కు వెళ్ళారు.

ఉక్రెయిన్ కు తిరిగి వెళ్ళిన భారతీయ విద్యార్థులు పలువురు మాట్లాడుతూ ఇక్కడ భయంకర పరిస్థితులున్నాయి. యుద్దం వల్ల తమ‌కు చావు బతుకుల సమస్య‌ ఎదురవుతోందని,. అయినా తమకు గత్యంతరం లేదన్నారు. ''మా ప్రభుత్వమే మాకు సహాయం చేయనప్పుడు మాకు మరో దారేముంది'' అని విద్యార్థులు అంటున్నారు.

ఉక్రెయిన్‌లోని వినిత్సియా మెడికల్ కాలేజీలో చదువుతున్న బీహార్‌లోని గయా జిల్లా నివాసి రవి కుమార్ ఇండియా టుడేతో మాట్లాడుతూ, మెడికల్ కాలేజీ దగ్గర తన హాస్టల్‌ని చూపిస్తూ, రోజూ ఐదు నుంచి ఏడు ఎయిర్ సైరన్‌లు వినిపిస్తున్నాయని చెప్పాడు.

విద్యార్థులు చాలా ఎక్కువ ధరకు ఆహారాన్ని కొనుక్కోవాల్సి వస్తోందని, అయితే తమ చదువును కొనసాగించాలంటే తప్పదు కదా అన్నాడు రవి.

"మా కుటుంబం ఆందోళన చెందుతోంది. మేము వారికి ఉక్రెయిన్ పరిస్థితుల గురించి నిజాలు చెప్పడంలేదని బాధపడుతున్నారు. కానీ మాకు గత్యంతరం ఏముంది? మేము చాలా పేద కుటుంబాల నుండి వచ్చాము. భారతదేశంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో వైద్య చదువులు చదివే స్తోమత మాకు లేదు," అని రవి ఆవేదన వ్యక్తం చేశాడు.

గోరఖ్‌పూర్ నివాసి మోహన్ కుమార్ అనే మరో విద్యార్థి భారత ప్రభుత్వం "ఆపరేషన్ గంగా"ను చేపట్టి మమ్మల్ని వెనక్కి బారత్ కు తీసుకెళ్ళడం మంచిపనే. అయితే ఎన్నినెలలు వేచి చూసినా, మాకు భారతీయ వైద్య కళాశాలల్లో చేరడానికి అనుమతి ఇవ్వలేదు. అందుకు జాతీయ వైద్య మండలి సిద్ధంగా లేదు. ఈ పరిస్థితుల్లో మేము చదువు కొనసాగించాలంటే ఉక్రెయిన్ తిరిగిరావడం తప్ప ఇంకేం మార్గ‌ముంది ? అని ప్రశ్నించాడు. తన చేతిలో వైద్య పట్టా పొందే వరకు భారత్‌కు తిరిగి రానని ఆయన స్పష్టం చేశాడు.

ఉక్రెయిన్ లో యుద్దం మరింత తీవ్రమవుతున్న ఈ పరిస్థితుల్లో చావుబతుకుల మధ్య చదువు కొనసాగిస్తున్న భారతీయ విద్యార్థుల ప్రాణాలు క్షేమంగా ఉండాలని తపన పడుతున్న ఆ విద్యార్థుల‌ తల్లి తండ్రులు ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలో!

ఆ విద్యార్థులు తమ చదువును పూర్తి చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని కోరుకుందాం.

First Published:  29 Oct 2022 3:23 AM GMT
Next Story