Telugu Global
International

ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జి, ఆరుగురు మృతి.. అమెరికాలో ఘటన

అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓడ ఢీకొని ఏకంగా ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది.

ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జి, ఆరుగురు మృతి.. అమెరికాలో ఘటన
X

అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓడ ఢీకొని ఏకంగా ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఆ ప్ర‌మాదంలో కనపడకుండా పోయిన ఆరుగురు మృతి చెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై మరమ్మతు పనులు చేపడుతున్న ఆరుగురు వర్కర్ లు నీటిలో పడిపోయారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది లోతు, కనిపించకుండా పోయిన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చూస్తే వారు ఖచ్చితంగా మరణించి ఉంటారని భావిస్తున్నారు.

పటాప్ స్కో నదిపై ఉన్న ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ’ బ్రిడ్జి కూలి ‘డాలీ’ అనే కంటెయినర్ షిప్‌పై పడింది. ఒక్క క్షణంపాటు విద్యుత్ పోవడంతో షిప్ ముందుకు వెళ్లే దిశపై నియంత్రణ తప్పి దూసుకెళ్లి బ్రిడ్జి ఐరన్ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ సమయంలో నౌక ప్రమాద సిగ్నల్స్ కూడా ఇచ్చింది. స్పందించిన సిబ్బంది ఎంత ప్రయత్నించినా షిప్ నియంత్రణలోకి రాలేదు. చివరి ప్రయత్నంగా లంగర్లను ఉయోగించినప్పటికీ ఫలితం దక్కలేదు. దూసుకెళ్లి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొంది.


నౌక ఢీకొనగానే వంతెన పిల్లర్‌ ఒక్కసారిగా విరిగిపోయింది. కొన్ని సెకన్లలోనే వంతెన అలా కుప్పకూలిపోయింది. దీంతో ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నదిలో పడిపోయాయి. ఈ సమయంలో సుమారు 20 మంది గల్లంతయినట్టుగా సమాచారం.

నదిలో పడిన వారిలో ఇద్దరిని సహాయక సిబ్బంది కాపాడారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఢీకొన్న నౌకలోనూ మంటలు చెలరేగాయి. అందులోని 22 మంది నౌకా సిబ్బంది అంతా భారతీయులే. వారంతా క్షేమంగానే ఉన్నారు.

ప్రమాద సంబంధ సమాచారాన్ని నౌకా సిబ్బంది అధికారులకు వెనువెంటనే అందించటంతో మరుక్షణం వంతెనపై వాహనాలను ఆపేసారు. దీంతో భారీ ముప్పు తప్పింది. అలాగే ప్రమాదం జరిగినది రాత్రి పూట కావడం, వంతెనపై వాహణాలు తక్కువగా ఉండడంతో ప్రాణనష్టం తీవ్రత తగ్గింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

ఈ ఘోర ప్రమాదంపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది. ప్రమాదానికి గురైన భారతీయ పౌరుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్టు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

First Published:  27 March 2024 6:07 AM GMT
Next Story