Telugu Global
International

గూగుల్ చట్ట వ్యతిరేకంగా ఎదిగిందా? అమెరికా కోర్టులో ప్రారంభం కానున్న విచారణ

యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్, గూగుల్ మధ్య ఈ కేసు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కేసును గెలవడం కోసం గూగుల్ ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులు, మూడు పవర్ ఫుల్ లా ఫర్మ్స్‌ను ఉపయోగిస్తున్నది.

గూగుల్ చట్ట వ్యతిరేకంగా ఎదిగిందా? అమెరికా కోర్టులో ప్రారంభం కానున్న విచారణ
X

ఇంటర్నెట్‌లో ఏ విషయాన్ని వెతకాలన్నా గూగుల్‌ను ఆశ్రయిస్తుంటాము. అమెరికాలో 90 శాతం మంది.. మిగిలిన ప్రపంచ దేశాల్లో 91 శాతం మంది గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను వాడుతున్నారు. 1998లో ప్రారంభమైన గూగుల్.. ప్రస్తుతం 1.8 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. అనేక రంగాల్లో గూగుల్ అగ్రగామిగా ఉన్నది. అయితే.. గూగుల్ ఇంతగా ఎదగడానికి అక్రమ పద్దతులు అనుసరించిందా? మార్కెట్‌లో గుత్తాధిపత్యం సాధించడానికి చట్టాన్ని ఉల్లంఘించిదా? అనే విషయంపై అమెరికాలోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టులో కేసు విచారణ ప్రారంభం కానున్నది. ఇంటర్నెట్ ఎరాలో ఇదే మొట్టమొదటి మోనోపలి ట్రయల్ కేసు కావడం గమనార్హం.

యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్, గూగుల్ మధ్య ఈ కేసు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కేసును గెలవడం కోసం గూగుల్ ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులు, మూడు పవర్ ఫుల్ లా ఫర్మ్స్‌ను ఉపయోగిస్తున్నది. అంతే కాకుండా మిలియన్ల కొద్దీ డాలర్లను లీగల్ ఫీజులు, లాబీయింగ్ కోసం వెచ్చిస్తోంది. ఈ కేసు తుది తీర్పు కేవలం గూగుల్ మీదే కాకుండా యాపిల్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీల మీద కూడా ఉండబోతోంది.

మోడ్రన్ ఇంటర్నెట్ ఎరాలో అనేక టెక్ కంపెనీలు కామర్స్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ డిస్‌కోర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి రంగాల్లో బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా కోర్టులో జరుగనున్న ట్రయల్.. సదరు కంపెనీల అసలు రూపాన్ని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారుల నమ్మకంపై ద్రోహానికి పాల్పడి.. తమ వ్యాపారాన్ని వేగంగా వృద్ధి చేసుకొని.. ఇప్పుడు పవర్ ఫుల్ కంపెనీలుగా ఎదిగాయా అనే విషయం బయటపడే అవకాశం ఉన్నది.

1998లో మైక్రోసాఫ్ట్ కంపెనీపై యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ కోర్టుకు లాగింది. అప్పట్లో అదో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత యూఎస్‌లో మోనోపలిపై జరగనున్న ట్రయల్ గూగుల్‌దే కావడం గమనార్హం. గూగుల్, ఆపిల్, అమెజాన్, మెటా వంటి సంస్థలు ప్రజల జీవితాల్లోకి ఎంతగానో చొచ్చుకొని పోయాయి. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

1998లో సిలికాన్ వ్యాలీలో స్థాపించబడిన గూగుల్ సంస్థ ఇప్పుడు ఆన్‌లైన్ సెర్చ్‌లో జెయింట్‌గా మారిపోయింది. అయితే గూగుల్ తమ గుత్తాధిపత్య వ్యాపార ధోరణిని మార్చుకోవాలని అమెరికా ప్రభుత్వం ఎప్పటి నుంచో సూచిస్తోంది. గూగుల్ వ్యవహార శైలి కారణంగా ఎన్నో చిన్న కంపెనీలు అంతమయ్యాయని, మరి కొన్ని కంపెనీలు ఎదగలేక పోతున్నాయని గవర్నమెంట్ చెబుతోంది. వీటన్నింటికీ గూగుల్ తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలని వాదిస్తోంది. ఇది అత్యంత ముఖ్యమైన కేసు.. ప్రస్తుతం మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తున్న అనేక కంపెనీలకు ఉపయోగపడుతుందని యాంటీ ట్రస్ట్ లాను భోదించే ఫిలిప్స్ లారా చెబుతున్నారు.

యాపిల్‌తో పాటు ఇతర సంస్థలకు భారీగా పేమెంట్లు చేయడం ద్వారా వారి ఉత్పత్తుల్లో గూగుల్ సెర్చ్ ఇంజన్ డిఫాల్డ్‌గా ఉండేలా గూగుల్ ప్రభావితం చేసిందని.. అక్రమ పద్దతుల్లో తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నదని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలాంటి భారీ ఒప్పందాల వల్ల గూగుల్ గుత్తాధిపత్యాన్ని సంపాదించిందని చెబుతున్నది. అయితే, తాము చేసుకున్న అగ్రిమెంట్లు తప్పకుండా పాటించాల్సిన అవసరం లేదని.. యూజర్లు ఆయా డివైజ్‌లలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెర్చ్ ఇంజన్‌ను మార్చుకునే వెసులు బాటు ఉందని గూగుల్ వాదిస్తోంది.

మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా 2014 అక్టోబర్‌లో అమిత్.పి. మెహతాను ఈ కేసు జడ్జిగా నియమించారు. ఇప్పటికి ఇద్దరు అధ్యక్షులు మారినా.. కేసు విచారణ ప్రారంభం కాలేదు. అయితే గత 10 రోజుల నుంచి ట్రయల్‌కు సన్నాహలు చేస్తున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో పాటు యాపిల్, ఇతర టెక్ కంపెనీల ఎగ్జిక్యూటీవ్‌లను ట్రయల్‌కు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఈ ట్రయల్‌కు ఎలాంటి జ్యూరీ లేదని.. జడ్జి మెహతా ఇచ్చే తీర్పే ఫైనల్ రూలింగ్ కానున్నదని సమాచారం. ప్రభుత్వం తరపున కెన్నెత్ డింజర్ వాదించనుండగా.. గూగుల్ తరపున విలియమ్ అండ్ కనోలీ ఫర్మ్‌కు చెందిన జాన్ షిమ్‌ద్లిన్ వాదనలు వినిపిస్తారు.

First Published:  7 Sep 2023 2:33 AM GMT
Next Story