Telugu Global
International

ఆఫ్ఘ‌న్ లో అరాచ‌కాలు..విద్యార్ధినులు పై చదువులు చదవకుండా ఆంక్ష‌లు

ఆఫ్ఘన్ లో తాలిబాన్ ప్రభుత్వ అరాచ‌కాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. విద్యార్థినులు ఉన్నత చదువుల కోసం దేశం విడిచి వెళ్ళొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు తాలిబన్లు.

ఆఫ్ఘ‌న్ లో అరాచ‌కాలు..విద్యార్ధినులు పై చదువులు చదవకుండా ఆంక్ష‌లు
X

ఆఫ్ఘన్ లో తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అరాచ‌కాలు పెచ్చుమీరుతున్నాయి. గత సంవత్సరం అమెరికా ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ త‌ర్వాత అప్ప‌టి ప్ర‌భుత్వం ప‌త‌న‌మై తాలిబ‌న్లు 2021 సెప్టెంబ‌ర్ లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అప్పటి నుంచి అనేక ప్రజా వ్యతిరేక‌ చర్యలు చేపడుతున్న తాలిబన్లు తాజాగా మ‌రో దారుణమైన నిర్ణ‌యం తీసుకున్నారు. ఉన్న‌త విద్య కోసం విద్యార్థినులు దేశం విడిచి ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్ళ‌రాదంటూ నిషేధాజ్ఞ‌లు జారీ చేసింది. విద్యార్ధినులు కాబూల్ విడిచి కజికిస్తాన్‌, ఖతార్‌లలో చదువుకోవడానికి వెళ్ళేందుకు అనుమతి నిరాక‌రించింది. విద్యార్ధి, విద్యార్ధినులు చ‌దువుల కోసం కాబూల్ విడిచి వెళ్ళాల‌నే ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంద‌ని, విద్యార్ధులు మాత్ర‌మే వెళ్ళేందుకు అనుమ‌తి ఇస్తున్నామ‌ని ఆడ‌పిల్ల‌లు ఆఫ్ఘ‌నిస్తాన్ విడిచి వెళ్ళేందుకు అంగీక‌రించ‌బోమ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ వార్త‌లు వెలువ‌డ్డాయి. అప్ప‌టి నుంచి వివ‌క్షా పూరితంగా అరాచ‌క పాల‌న సాగిస్తోంది.

ఇప్పటికే తాలిబాన్లు, ఆఫ్ఘన్ మహిళలు తమ ఇళ్ల నుంచి బ‌య‌టికి వెళ్ళి పని చేయకుండా నిషేధించారు. పాఠశాలల్లో లింగ వివ‌క్ష‌ను ప్ర‌వేశ‌పెట్టి బాల‌బాలిక‌ల‌కు వేర్వేరుగా త‌ర‌గ‌తులు కేటాయించారు. ఆడపిల్లలు ఆరో తరగతికి మించి చదువుకోకూడదంటూ నిషేధించారు. అలాగే మ‌హిళ‌లు బ‌హిరంగ ప్ర‌దేశాల‌కు వ‌చ్చిన‌ప్పుడు వారు త‌మ ముఖాలు క‌న‌బ‌డ‌కుండా బుర‌ఖాలు ధ‌రించాల‌ని ఒత్తిడి చేస్తున్నారు. అలాగే పురుషుల‌తో క‌లిసి పార్కులు త‌దిత‌ర వినోద ప్రాంతాల‌ల్లో మ‌హిళ‌లు ఉండ‌రాదంటూ తాలిబాన్ల ప్ర‌భుత్వం ఆజ్ఞ‌లు జారీ చేసింది.

అంతేకాకుండా, ఆగష్టు 2021లో తాలిబాన్లు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి లింగ వివ‌క్ష చూపుతూ మ‌హిళ‌ల‌పై హింసకు పాల్ప‌డుతూ వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. ఆరోగ్యం,విద్య, ఉద్యోగాల‌లో మహిళలకు కొత్త అడ్డంకులను సృష్టించారు. మహిళా సహాయక సిబ్బందిని వారి ఉద్యోగాలు చేయకుండా ప్ర‌భుత్వం నిరోధించింది.మహిళా హక్కులను కాల‌రాసింది. తాలిబాన్లు స్త్రీలు ,బాలికల విద్య, పని, స్వేచ్ఛా ఉద్యమంపై హక్కులను ఉల్లంఘించారు. గృహ హింస నుండి పారిపోతున్న వారికి రక్షణ. మద్దతు క‌ల్పించే వ్యవస్థను నాశనం చేశారు.

వివక్షాపూరిత నిబంధ‌న‌ల‌తో చిన్న‌చిన్న పొర‌బాట్ల‌కు కూడా మ‌హిళ‌లు, బాలిక‌ల‌ను నిర్బంధిస్తోంది. బ‌ల‌వంతంగా చిన్న పిల్ల‌ల‌కే వివాహాలు చేసే సంఘ‌ట‌న‌లు పెరిగిపోయాయి. తాలిబాన్ ప్ర‌భుత్వం ప‌లు సంస్క‌ర‌ణ‌లు, దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మ‌హిళ‌లు, బాలిక‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు విధాన‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హక్కుల సంఘాలు తాలిబాన్‌లకు పిలుపునిచ్చాయి.

ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబ‌న్లు వారి మొదటి మీడియా సమావేశంలో 'సమ్మిళిత సమాజం, సమానత్వం' గురించి వాగ్దానం చేశారు. కానీ వాస్త‌వంలో ప‌రిస్థితులు అందుకు చాలా భిన్నంగా ఉన్నాయి.

మహిళా ఉద్యమం, విద్య, భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు వారి మనుగడకు ముప్పుగా పరిణమించాయి. తాలిబాన్ మహిళలు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించకుండా నిరోధించారు. అవసరమైన రక్షణను అందించడానికి మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరచుగా డబ్బు వసూలు చేస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. మీడియాలో పనిచేస్తున్న 80 శాతం మంది మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దేశంలో దాదాపు 18 మిలియన్ల మంది మహిళలు ఆరోగ్యం, విద్య సామాజిక హక్కుల కోసం పోరాడుతున్నారు.

First Published:  27 Aug 2022 7:03 AM GMT
Next Story