Telugu Global
International

ఎలాన్ మస్క్ ఫ్యూచర్ ప్లాన్.. సెల్ సిగ్నల్ లేని ప్రాంతమే ఉండదు.!

యూఎస్, హవాయి, అలస్కా, ప్యూర్టొరికో‌లోని ప్రతీ ప్రాంతంతో పాటు అమెరికాకు చెందిన సముద్ర జలాల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉంటాయి.

ఎలాన్ మస్క్ ఫ్యూచర్ ప్లాన్.. సెల్ సిగ్నల్ లేని ప్రాంతమే ఉండదు.!
X

నికోల టెస్లా.. భవిష్యత్‌ను ముందుగానే ఊహించిన శాస్త్రవేత్త. వైర్‌లెస్ టెక్నాలజీ.. మొబైల్ ఫోన్లు వంటివి వస్తాయని ఆయన శతాబ్దం క్రితమే అంచనా వేశారు. ఆయన మీద అభిమానంతోనే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన సంస్థకు టెస్లా అనే పేరు పెట్టుకున్నాడు. కేవలం సంస్థకు పేరు పెట్టుకోవడమే కాదు.. ఎలాన్ మస్క్ ఆలోచనలు కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. అంతరిక్షంలోకి టూరిస్టు రాకెట్లు నడుపుతారని ఎవరైనా అనుకున్నారా? కానీ మస్క్ దాన్ని నిజం చేసి చూపించాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేసే రాకెట్లను కూడా ఎలాన్ మస్క్ నడుపుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సరికొత్త ఆలోచనకు ఆయన తెర తీశారు.

మనకు సెల్‌ఫోన్ అందుబాటులో ఉండటంతో ఎప్పుడైనా.. ఎక్కడి నుంచి అయినా మన బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉండొచ్చు. అయితే సెల్ ఫోన్ కంపెనీలు మూల మూలలకు కవరేజీని అందించవు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, హైవేలు, జనసంచారం ఉండే ప్రాంతాల్లో మాత్రమే టవర్లు నిర్మించి సేవలు అందిస్తుంటాయి. ఇప్పటికీ భూమ్మీద చాలా ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. అంతెందుకు.. మనకు దగ్గరలోని అడవిలోకి వెళ్తేనే సిగ్నల్ దొరకవు. ఇందుకు ఎలాన్ మస్క్ ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఎడారిలో, సముద్రంలో, అడవుల్లో ఎక్కడైనా సెల్‌ఫోన్ సిగ్నల్ అందుబాటులో ఉంచే భారీ ప్రాజెక్టును ప్రారంభించారు.

అమెరికాలోని టీ-మొబైల్స్ సంస్థతో కలసి ఎలాన్ మస్క్ ఈ లేటెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అమెరికాలోని మూలమూలలకు సెల్ ఫోన్ సిగ్నల్ ఉండేలా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. యూఎస్‌లోని 5 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో సెల్ ఫోన్ సిగ్నల్ లేవు. వీటిని డెడ్ జోన్స్ అంటారు. ఎడారులు, దట్టమైన అడవులు, జనసంచారం లేని ప్రాంతలు ఇవి. అక్కడ సెల్ ఫోన్ టవర్లను నిర్మించడానికి ఏ మొబైల్ కంపెనీ కూడా ఆసక్తి చూపడం లేదు. పైగా టవర్లు నిర్మించినా.. భారీ ఖర్చే తప్ప లాభం ఉండదు. అందుకే ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్లతో సెల్ ఫోన్ సిగ్నల్స్ అందించే ప్రాజెక్టును ప్రారంభించారు.

ఎలా పని చేస్తుంది?

టీ-మొబైల్, స్టార్ లింక్ శాటిలైట్లు కలిసి ఒక కొత్త మొబైల్ నెట్‌వర్క్‌ను సృష్టించనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే టీ-మొబైల్ వద్ద ఉన్న మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించనున్నారు. ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే సెల్‌ఫోన్లు టవర్ సిగ్నల్స్ లేని దగ్గర స్టార్ లింక్ శాటిలైట్లు పంపే మొబైల్ సిగ్నల్స్‌ను ఉపయోగించుకుంటాయి. యూఎస్, హవాయి, అలస్కా, ప్యూర్టొరికో‌లోని ప్రతీ ప్రాంతంతో పాటు అమెరికాకు చెందిన సముద్ర జలాల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉంటాయి.

స్టార్ లింక్ శాటిలైట్లకు అమర్చిన భారీ యాంటెన్నాల సాయంతో సిగ్నల్స్‌ను విడుదల చేస్తారు. ఒక్కో యాంటెన్నా దాదాపు 25 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. భూమి చుట్టూ నిత్యం గంటకు 17వేల మైళ్ల వేగంతో తిరుగుతున్న ఈ శాటిలైట్లు టీ-మొబైల్ యూజర్లకు నిత్యం సిగ్నల్ అందుబాటులో ఉండేలా చేస్తాయి. ఏదైనా ఎడారి లేదా అడవిలోకి వెళ్లినప్పుడు టీ-మొబైల్ సిగ్నల్ కోసం స్కాన్ చేసినప్పుడు సిగ్నల్ దొరకక పోతే.. వెంటనే స్టార్ లింక్ శాటిలైట్లతో ఫోన్ కనెక్ట్ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకమైన ఫోన్లు అవసరం లేదని.. ఇప్పుడు ఉన్న ఫోన్లు అన్నింటిలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉందని మస్క్ చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఈ టెక్నాలజీకి కొన్ని పరిమితులు ఉన్నట్లు ఎలాన్ మస్క్‌తో పాటు టీ-మొబైల్ సీఈవో మైక్ సీవర్ట్ చెప్తున్నారు. ప్రస్తుతం స్టార్ లింక్ శాటిలైట్ల ద్వారా వచ్చే బ్యాండ్ విడ్త్ కేవలం 2 నుంచి 4 ఎంబీ మాత్రమే. అమెరికాలోని దాదాపు 5 లక్షల చదరపు మైళ్ల డెడ్ జోన్లను కవర్ చేయాలంటే ఆ బ్యాండ్ విడ్త్ సరిపోదు. కేవలం 1000 నుంచి 2000 వాయిస్ కాల్స్ మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా టెక్ట్స్ మెసేజ్ సర్వీస్ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ బ్యాండ్ విడ్త్‌తో లక్షలాది మెసేజెస్ పంపుకునే అవకాశం ఉన్నది. అడవి, సిగ్నల్ లేని నిర్మానుష్య ప్రాంతంలో చిక్కుకున్నప్పుడు బంధువులు, స్నేహితులు లేదా పోలీసులకు ఒక ఎస్ఎంఎస్ చేస్తే చాలు. అందుకే ముందు మెసేజింగ్ సర్వీస్ ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు.

టీ-మొబైల్ యూజర్లకు ప్రస్తుతం ఈ సర్వీస్ ఉచితంగానే అందించనున్నట్లు తెలిపారు. టీ-మొబైల్ యూజర్లు కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా.. తమ రోమింగ్ పార్ట్‌నర్ సిగ్నల్ లేకపోతే శాటిలైట్‌తో అనుసంధానం అయ్యే అవకాశం ఉన్నది. ఉదాహరణకు అమెరికాకు చెందిన టీ-మొబైల్ యూజర్ ఇండియాకు వస్తే ఇక్కడి రోమింగ్ పార్ట్‌నర్ అయిన వోడాఫోన్-ఐడియా నెట్‌వర్క్ ఉపయోగిస్తాడు. ఎక్కడైనా వోడాఫోన్-ఐడియా సిగ్నల్ లేకపోతే ఆటోమెటిక్‌గా స్టార్ లింక్ శాటిలైట్ సిగ్నల్‌కు అనుసంధానం అవుతుంది.

ప్రస్తుతానికి మెసేజింగ్‌కు మాత్రమే పరిమితం చేసినా.. భవిష్యత్‌లో పంపే స్టార్ లింక్ శాటిలైట్ల ద్వారా డేటా సర్వీసులు కూడా ఉపయోగించుకునే వీలుంటుందని చెప్పారు. మెసేజింగ్ యాప్స్‌ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని.. అవి సఫలం అయితే ఏ మూల నుంచి అయినా వాట్సప్, టెలిగ్రామ్ వంటి యాప్స్‌ను ఉపయోగించవచ్చని మస్క్ చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని మస్క్ స్పష్టం చేశారు. మార్స్ మీద సెల్ ఫోన్ సేవలు అందించే మొదటి కంపెనీ టీ-మొబైల్ అవుతుందని ఆయన జోస్యం కూడా చెప్పడం విశేషం.

First Published:  27 Aug 2022 2:27 AM GMT
Next Story