Telugu Global
International

అదానీకి అంటించిన నిప్పు చల్లారక ముందే మరో కంపెనీపై బాంబు వేసిన హిండెన్ బర్గ్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో గురువారం ప్రచురించిన నోట్‌లో, బ్లాక్ ఇంక్ సంస్థ తన యూజర్ కౌంట్స్‌ను అతిగా చూపించిందని, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్స్‌ను తక్కువగా చూపించిందని పేర్కొంది. బ్లాక్ ఇంక్ లోని 40 శాతం నుంచి 75 శాతం వరకు ఖాతాలు నకిలీవని ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగులు చెప్పారని తెలిపింది.

అదానీకి అంటించిన నిప్పు చల్లారక ముందే మరో కంపెనీపై బాంబు వేసిన హిండెన్ బర్గ్
X

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసర్చ్ ఈ సంవత్సరం జనవరిలో అదానీ కంపనీల్లోని అవకత‌వకలు, మోసాలపై విడుదల చేసిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవడమే కాదు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న అదానీ ఏకంగా 29వ స్థానానికి దిగజారి పోయాడు. 12 లక్షల కోట్లకు పైగా ఆయన‌ ఆస్తులు ఆవిరైపోయాయి. హిండెన్ బర్గ్ రాజేసిన నిప్పు భారత్ లో ఇప్పటికీ ఆరడం లేదు. అదానీ గ్రూప్ అవకతవకలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హిండెన్ బర్గ్ మరో కంపెనీ పై బాంబు వేసింది. ఆ కంపనీలోని అవకతవకలను బహిర్గతపర్చింది. ఆ బాంబు ఈ సారి ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ నేతృత్వంలోని డిజిటల్ చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్ పై పడింది. ఆ సంస్థ పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిందని హిండెన్ బర్గ్ ఆరోపించింది.హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ నేతృత్వంలో రెండు సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన తర్వాత ఈ నివేదిక విడుదల చేస్తున్నట్టు హిండెన్ బర్గ్ తెలిపింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో గురువారం ప్రచురించిన నోట్‌లో, బ్లాక్ ఇంక్ సంస్థ తన యూజర్ కౌంట్స్‌ను అతిగా చూపించిందని, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్స్‌ను తక్కువగా చూపించిందని పేర్కొంది. బ్లాక్ ఇంక్ లోని 40 శాతం నుంచి 75 శాతం వరకు ఖాతాలు నకిలీవని ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగులు చెప్పారని తెలిపింది. ఈ ఖాతాలు మోసపూరితం, ఒకే వ్యక్తికి అనేక ఖాతాలు సృష్టించడం వంటి అక్రమాలు జరిగినట్లు చెప్పారని పేర్కొంది.

హిండెన్ బర్గ్ నివేదిక విడుదల కాగానే బ్లాక్ ఇంక్ సంస్థ షేర్లు దారుణంగా పతనమయ్యాయి.బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం, US ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ ఇంక్ షేర్లు న్యూయార్క్‌లో 20 శాతం క్షీణించాయి.

కాగా, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే చైర్మన్ గా, వ్యాపారులు, వినియోగదారుల కోసం డిజిటల్ చెల్లింపు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి బ్లాక్ ఇంక్ కంపెనీని 2009లో స్థాపించారు.

First Published:  24 March 2023 5:12 AM GMT
Next Story