Telugu Global
International

గొప్ప‌దైన గ్రేట్ బ్రిటన్ నాకెంతో ఇచ్చింది...తొలి ప్ర‌సంగంలో రిషి సునాక్‌

త‌న‌కు ఎంతో ఇచ్చిన ఈ దేశానికి తిరిగి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని బ్రిటన్ కు ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ అన్నారు. గొప్ప‌దైన గ్రేట్ బ్రిట‌న్ ప్ర‌స్తుతం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటోంద‌ని, ఈ ఆర్ధిక స‌వాల్ ను అధిగ‌మించేందుకు ఐక‌మ‌త్యంతో స్థిర‌త్వం సాధించ‌డం ముఖ్య‌మ‌ని చెప్పారు.

గొప్ప‌దైన గ్రేట్ బ్రిటన్ నాకెంతో ఇచ్చింది...తొలి ప్ర‌సంగంలో రిషి సునాక్‌
X

బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టడం తన జీవితంలో లభించిన అత్యంత గొప్ప గౌరవం అని రిషి సునాక్ (42) పేర్కొన్నారు. ప్రజ‌లు ఎదుర్కొంటున్న సమస్యల ప‌రిష్కారానికి నిరంత‌రం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానిగా ఎన్నిక‌య్యాక ఆయ‌న తొలిసారిగా స్పందించారు. లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైన విష‌యం తెలిసిందే.

కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు త‌న‌పై నమ్మకం ఉంచడాన్ని త‌న‌కు లభించిన గౌరవంగా భావిస్తాను అన్నారు. వారి ఆదరణ త‌నను ముగ్ధుడ్ని చేసింది అని తెలిపారు. త‌న‌కు ఎంతో ఇచ్చిన ఈ దేశానికి తిరిగి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని తెలిపారు. పార్టీకి కూడా శక్తివంచన లేకుండా సేవలు అందిస్తానని సునాక్ పేర్కొన్నారు. గొప్ప‌దైన గ్రేట్ బ్రిట‌న్ ప్ర‌స్తుతం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటోంద‌ని, ఈ ఆర్ధిక స‌వాల్ ను అధిగ‌మించేందుకు ఐక‌మ‌త్యంతో స్థిర‌త్వం సాధించ‌డం ముఖ్య‌మ‌ని అన్నారు.

భ‌విష్య‌త్తు త‌రాల కోసం నిబ‌ద్ధ‌త‌తో పార్టీని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళ‌డ‌మే త‌న ప్ర‌ధాన క‌ర్త‌వ్యం అని రిషి తెలిపారు. అందుకు మ‌న ముందున్న సవాళ్లను అధిగమించ‌డ‌మే మార్గమని స్పష్టం చేశారు. అందుకు స‌మ‌ష్టిగా కృషి చేద్దామ‌ని పిలుపునిచ్చారు.

బ్రిటన్ లో న‌లువైపులా కష్టాలు చుట్టుముట్టిన స‌మ‌యంలో లిజ్ ట్ర‌స్ ఎంతో అంకిత‌భావంతో ప్ర‌జాసేవ‌కు పాటుప‌డ్డార‌ని రిషి కొనియాడేరు. క్లిష్ట సమయంలో ఆమె ఎంతో హుందాగా బాధ్యతలు నిర్విర్తించారని రిషి సునాక్ ప్రశంసించారు.

First Published:  25 Oct 2022 5:15 AM GMT
Next Story