Telugu Global
International

లేఆఫ్ లకు ఇది పరాకాష్ట.. భార్యాభర్తలిద్దరికీ గూగుల్ షాక్

ఎలీ ప్రస్తుతం మెటర్నటీ లీవ్ లో ఉన్నారు. మరికొంతకాలం బిడ్డకోసం సెలవు తీసుకుందామనుకున్న టైమ్ లో గూగుల్ షాకిచ్చింది. స్టీవ్ కూడా బిడ్డ కోసం రెండు నెలలు పెటర్నిటీ లీవ్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ దశలో వారి ఉద్యోగాలు తొలగించారు.

లేఆఫ్ లకు ఇది పరాకాష్ట.. భార్యాభర్తలిద్దరికీ గూగుల్ షాక్
X

ప్రపంచ వ్యాప్తంగా లే ఆఫ్ ప్రకటనలు ఐటీ ఉద్యోగుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు లే ఆఫ్ వ్యవహారంతో భయపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా లే ఆఫ్ లు ప్రకటించడంతో సీనియర్ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలున్నాయి. క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా తెచ్చుకున్న ఫ్రెషర్స్ ని కూడా కొన్ని కంపెనీలు తరిమేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గూగుల్ సంస్థ చేసిన పని సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. భార్యాభర్తలిద్దరికీ గూగుల్ ఒకేసారి లే ఆఫ్ ప్రకటించడంతో ఓ కుటుంబం విలవిల్లాడిపోతోంది.

తాజాగా గూగుల్‌ ఓ జంటకు షాకిచ్చింది. భార్యాభర్తలిద్దరినీ ఒకేసారి ఉద్యోగం నుంచి తొలగించింది. కాలిఫోర్నియాలోని గూగుల్ ఆఫీస్ లో స్టీవ్ ఆరేళ్లుగా రీసెర్చ్ ఆపరేషన్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఎలీ మార్కెటింగ్ మేనేజర్ గా నాలుగేళ్ల క్రితం గూగుల్ లో చేరింది. గతేడాది వీరికి ఓ పాప పుట్టింది. ఎలీ ప్రస్తుతం మెటర్నటీ లీవ్ లో ఉన్నారు. మరికొంతకాలం బిడ్డకోసం సెలవు తీసుకుందామనుకున్న టైమ్ లో గూగుల్ షాకిచ్చింది. స్టీవ్ కూడా బిడ్డ కోసం రెండు నెలలు పెటర్నిటీ లీవ్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ దశలో వారి ఉద్యోగాలు తొలగించారు. ఒకేసారి ఇద్దరికీ ఉద్యోగాలు పోవడంతో స్టీవ్, ఎలీ జంట షాక్ కి గురైంది.

ఇతర సంస్థల ఆఫర్లు..

వీరికి కలిగిన కష్టాన్ని చూసి ఇతర ఐటీ కంపెనీలు ఉద్యోగాలిస్తామంటూ ముందుకొచ్చాయట. అయితే స్టీవ్, ఎలీ జంట మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2014లో వైట్ క్యూబ్ మీడియా అనే యూట్యూబ్ ఛానెల్ ను వారు మొదలు పెట్టారు. వివిధ వివరణాత్మక వీడియోలను రూపొందించి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఉద్యోగాల్లో బిజీ అయిన తర్వాత దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు తమకు అందివచ్చిన ఈ ఖాళీ సమయాన్ని కొత్త వీడియోలు తయారు చేయడానికి ఉపయోగిస్తామంటున్నారు స్టీవ్, ఎలీ. తాము కుంగుబాటుకి గురికాలేదని, త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే నాలుగు నెలల చిన్నారి ఉన్న తల్లిదండ్రులకు ఒకేసారి లేఆఫ్ ఇవ్వడంతో గూగుల్ వార్తల్లోకెక్కింది.

First Published:  27 Jan 2023 2:27 AM GMT
Next Story