Telugu Global
International

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అణుబాంబు అంత ప్ర‌మాద‌క‌రం.. - గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్‌

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)ను సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఇప్ప‌టికే పలువురు టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అణుబాంబు అంత ప్ర‌మాద‌క‌రం.. - గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్‌
X

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) పై నియంత్ర‌ణ లేకుంటే.. మాన‌వాళికి ముప్పు త‌ప్ప‌దని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ హెచ్చ‌రించారు. ఇటీవ‌ల వార్డ్రోట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎంతో మంది చెప్పినట్టుగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో అస్తిత్వ ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతానికి కాకపోయినా.. సమీప భవిష్యత్తులో వీటి నుంచి ముప్పు ఉంటుందని చెప్పారు. నేడు ఇది కల్పన మాత్రమే అయినప్పటికీ అది వాస్తవ రూపం దాల్చవచ్చని తెలిపారు. అటువంటిది సంభవించినప్పుడు అవి చెడు వ్యక్తుల బారినపడి దుర్వినియోగం కాకుండా చూసుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)ను సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఇప్ప‌టికే పలువురు టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎరిక్ స్మిత్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. గూగుల్ సీఈవోగా 2001 నుంచి 2011 వరకు కొనసాగిన ఎరిక్ స్మిత్.. 2015 నుంచి 2017 వరకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరించారు.

అది అణు సాంకేతిక‌త‌తో స‌మానం..

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అణు సాంకేతిక‌త‌తో స‌మాన‌మ‌ని ఎరిక్ స్మిత్ వ్యాఖ్యానించారు. దాని వ్యాప్తిని నియంత్రించ‌డం అత్యంత క‌ష్ట‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ సంస్థలైన ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ అధినేతలతో పాటు బ్రిటన్ ప్రధాని పాల్గొన్న ఈ సమావేశంలో ఎరిక్ ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.



బిల్ గేట్స్ సైతం..

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ దుష్ప్రభావాలపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో పాటు ఇతర టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సాంకేతికతను సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించిన పిచాయ్.. వాటి దుష్ప్రభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఇటీవల పేర్కొన్నారు. మరోవైపు బిల్ గేట్స్ కూడా టెక్ దిగ్గ‌జ అధినేత‌ల ఆందోళ‌న‌ను ఇటీవ‌ల అంగీక‌రించారు. అయితే ఏఐ సాధిస్తున్న పురోగ‌తిని కొనియాడిన గేట్స్‌.. ఈ సాంకేతికత పరిజ్ఞానానికి సంబంధించి ప్రభుత్వ నియంత్రణ అవసరమని స్ప‌ష్టం చేశారు.

First Published:  26 May 2023 1:45 AM GMT
Next Story