Telugu Global
International

మహిళా దినోత్సవం రోజున చైనాలో ఫ్రీ మ్యారేజెస్..

చైనాలో ఓ పెళ్లి జరగాలంటే అబ్బాయి తరపు వారు, అమ్మాయి కుటుంబానికి కనిష్టంగా లక్ష యువాన్లు.. అంటే 11.7 లక్షల రూపాయలు చదివించుకోవాల్సిందే. దీన్ని అక్కడ కైలి అంటారు.

మహిళా దినోత్సవం రోజున చైనాలో ఫ్రీ మ్యారేజెస్..
X

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అన్ని దేశాలు అట్టహాసంగా జరుపుకున్నాయి. మహిళలను సత్కరించాయి, సముచిత స్థానం కల్పిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. చైనాలో మాత్రం మహిళా దినోత్సవం రోజున ఫ్రీ మ్యారేజెస్ జరిగాయి. అంటే కన్యాశుల్కం ప్రస్తావన లేని ఉచిత వివాహాలన్నమాట. అన్ని ప్రాంతాల్లో వరకట్న సమస్య ఉంటే చైనాలో మాత్రం కన్యాశుల్కంతో యువకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీన్ని రూపుమాపేందుకు మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది.

చైనాలో సింగిల్ చైల్డ్ పాలసీతో ఈ విపత్తు ముంచుకొచ్చింది. ఆడపిల్లల జనాభా దారుణంగా పడిపోయింది. వివాహానికి అమ్మాయిని వెదుక్కోవాల్సిన పరిస్థితి. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో తల్లిదండ్రులు కన్యాశుల్కం డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. చైనాలో ఓ పెళ్లి జరగాలంటే అబ్బాయి తరపు వారు, అమ్మాయి కుటుంబానికి కనిష్టంగా లక్ష యువాన్లు.. అంటే 11.7 లక్షల రూపాయలు చదివించుకోవాల్సిందే. దీన్ని అక్కడ కైలి అంటారు. కైలి లేనిదే దాదాపుగా చైనాలో పెళ్లిళ్లు జరగడంలేదు. అందుకే అక్కడ ముదురు బ్రహ్మచారులు ఎక్కువయ్యారు. పెళ్లి చేసుకోకుండానే చాలామంది యువకులు జీవితం గడిపేస్తున్నారు.

కైలి లేకుండా పెళ్లి జరిగితే దాన్ని చైనాలో హెల్దీ మ్యారేజ్ గా పరిగణిస్తారు. కన్యాశుల్కం ప్రస్తావన లేకుండా పెళ్లి చేసుకునే వరుడు, వధువు పేర్లను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ప్రదర్శిస్తారు. ఇక కన్యాశుల్కం అడగని వధువు తల్లిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తిస్తుంది. ఆమెకు అందమైన అత్త అనే బిరుదు ఇస్తుంది. కొన్నాళ్లుగా కన్యాశుల్కానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరుస్తోంది చైనా ప్రభుత్వం. మహిళా దినోత్సవం రోజున పెద్ద సంఖ్యలో హెల్దీ మ్యారేజెస్.. అంటే ఫ్రీ మ్యారేజెస్ జరిపించింది.

First Published:  9 March 2023 2:29 AM GMT
Next Story